కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ ఏడాది బోనాల ఉత్సవాలను సాదాసీదాగానే జరుపుకోవాల‌ని భ‌క్తుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. జూన్​ 25 నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కొండ బోనాలు, జులై 12న సికింద్రాబాద్ మహంకాళి, జులై 19న హైదరాబాద్ బోనాలు ఉండబోవని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌‌ర‌‌ణ్ రెడ్డి తెలిపారు. ఆయా ఆల‌యాల‌ పూజారులే అమ్మవార్లకు బోనాలు, నైవేద్యం సమర్పిస్తారని  పేర్కొన్నారు.  ఇదిలా ఉండ‌గా తెలంగాణ ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల పండగ.  తెలంగాణ తెలుగు వారి పండుగగా దీనిని అభివర్ణించ‌వ‌చ్చు. జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో బోనాల ఉత్స‌వాలు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ప్రారంభ‌మ‌వుతాయి.

 

  పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు. బోనం అంటే దేవికి నైవేద్యం భోజనం అని అర్థం. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. 

 

చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండువగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. ఇలా ఎంతో భ‌క్తి విశ్వాసాల‌తో, ఆనందోత్స‌హాల మ‌ధ్య జ‌ర‌గాల్సిన బోనాల పండుగ‌కు దూరంగా ఉండ‌టం అంటే మ‌హాన‌గ‌రంలోని భ‌క్తుల‌కు కాస్త మ‌న‌స్సుకు బాధ‌గానే ఉంటుంద‌ని చెప్పాలి. కాని క‌రోనా వైర‌స్ వ్యాప్తి గ్రేట‌ర్‌ప‌రిధిలోనే ఎక్కువ‌గా ఉన్నందున రాష్ట్ర ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితుల్లో బోనాల ఉత్స‌వాల‌కు వేలాదిగా భ‌క్తుల‌ను అనుమ‌తించే సాహ‌సం చేయ‌క‌పోవ‌చ్చు. ఇప్ప‌టికే రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి స్ప‌ష్టత ఇచ్చిన విష‌యం విదిత‌మే...

మరింత సమాచారం తెలుసుకోండి: