తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే పరీక్షల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం.

 

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరీక్షలను నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఆదేశించింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్‌గా గుర్తించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

 

విద్యార్థులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నామని పరీక్షలకు అనుమతివ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీలో కరోనా పెరుగుతుండటంతో లక్షల మంది విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది.

 

పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. పరీక్షలు లేకుండా గ్రేడింగ్‌ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఈ నిర్ణయం వల్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యార్ధుల నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా పరీక్షల ఫలితాలప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విద్యార్ధుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. పరీక్షల లేకుండా డైరక్ట్‌గా విద్యార్థులు పాస్‌ చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యానిపుణులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: