దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య భారత్ ఇటలీని దాటేసింది. గత 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్ లో ఇంకా కరోనా విజృంభణ దశ రాలేదని, అది ఎప్పుడైనా జరగొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 

 

భారత్‌లో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా దాదాపు 9 వేల 887 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయి కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో శనివారం నాటికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 2 లక్షల 36 వేల 657కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 294 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6 వేల 642కు చేరింది. దేశంలో కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇప్పటివరకు లక్ష 14 వేల 72 మంది కోలుకోగా మరో లక్ష 15 వేల 942 మంది చికిత్స పొందుతున్నారు.

 

ప్రపంచంలో కొవిడ్‌-19 కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో ఇటలీని దాటి భారత్‌ ఆరో స్థానానికి చేరింది. 2 లక్షల 34 వేల 531 కేసులతో ఇటలీ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉండగా.. లక్ష 87 వేల 400 కేసులతో పెరూ ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. 19 లక్షల 35 వేల 432 కేసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 

భారత్‌లో కరోనా వైరస్‌ ఇంకా విజృంభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన నేపథ్యంలో ఏ సమయంలోనైనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చవచ్చని హెచ్చరించారు. కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి పడుతున్న సమయం, సామూహిక వ్యాప్తిపై దృష్టి సారించి కేసులు విపరీతంగా పెరగకుండా కట్టడి చేయాలని సూచించారు. కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ.. వైరస్‌ విజృంభిస్తోందని మాత్రం ఇప్పుడే చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. 

 

ఇప్పటికీ భారత్ లో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి పడుతున్న సమయం మూడు వారాలుగా ఉందని తెలిపింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వంటి చర్యలు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో సానుకూల ప్రభావం చూపాయని, అయితే, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వైరస్‌ విజృంభణ ముప్పును కొట్టిపారేయలేమని హెచ్చరించారు.  లాక్‌డౌన్‌ క్రమంగా ఎత్తివేస్తున్న సమయంలో.. వైరస్‌ కట్టడి బాధ్యత పూర్తిగా ప్రజలపైనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తుచేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: