హైద‌రాబాద్‌లో పాత ప‌రిస్థితులే మ‌ళ్లీ క‌నిపిస్తున్నాయి. ఒకింత బ్రేక్ త‌ర్వాత దాదాపు రెండు నెల‌ల అనంత‌రం కీల‌క ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన కూలీలు.. తిరిగి పట్నం బాట పడుతున్నారు. నిర్మాణ రంగ పనులు ప్రారంభం కావడంతో ఉపాధి కోసం తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో బోసిపోయిన లేబర్‌ అడ్డాలు కార్మికులతో మళ్లీ కళకళలాడుతున్నాయి.

 

తెలంగాణ‌లో ప్రస్తుతం నిర్మాణ రంగానికి కూలీలు 2 నుంచి 3 లక్షల మంది అవసరం ఉందని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ చెబుతున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో కూలీలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గడిచిన కొన్ని రోజులుగా డెవలపర్లు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ సడలింపులతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు షురూ కావడంతో వలసెల్లిన జీవులు పొట్టకూటి కోసం నగరానికి వస్తున్నారు. అంతేకాకుండా రైల్వే సర్వీసులు ప్రారంభం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులతో రైళ్లు, బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రాష్ట్రం నుంచి రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ తదితర జిల్లాల నుంచి వలస కార్మికులు నిర్మాణ రంగం పనుల్లోకి చేరారని, ఇతర రాష్ర్టాల నుంచి  కార్మికులు వచ్చే సరికి ఇంకొంత సమయం పట్టవచ్చని బిల్డర్లు చెబుతున్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. యూపీ, జార్ఖండ్‌, బీహార్‌, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి కార్మికుల తాకిడి మొదలైతే  నిర్మాణ రంగం మునుపటి కళను సంతరించుకుంటుందని చెప్పారు. శంషాబాద్‌, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌ జోన్ల పరిధిలోని కోకాపేట, మోకిల, గోపన్‌పల్లి, మణికొండ, పుప్పాలగూడ, పెద్ద అంబర్‌పేట, మహేశ్వరం, ఆదిబట్ల, బొంగుళూరు జంక్షన్‌, తెల్లాపూర్‌, సాగర్‌రోడ్‌, ఘట్‌కేసర్‌, ఉప్పల్‌ టూ భువనగిరి, మేడ్చల్‌ పరిధిలో కొత్త వెంచర్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు ఊపందుకున్నాయని నిపుణులు తెలిపారు. 50శాతం మేర పనుల్లో స్పీడ్‌ పెరిగిందని పేర్కొంటున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో లేబర్‌ అడ్డాలు ఉన్నాయి. ఉదయమే ఈ అడ్డాలకు చేరుకుని కూలీలు పనులకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ సడలింపుతో చాలా ప్రాంతాలలోని అడ్డాలు కూలీలతో సందడిగా మారాయి. హైదరాబాద్‌లో పనికి కొదవ ఉండదని వ‌ల‌స కూలీలు చెప్తున్నారు. ఉన్న ఊళ్లో పనిలేక ఇక్కడికి వచ్చామ‌ని చెప్తున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల‌ నడుచుకుంటూనే ఇంటికి వెళ్లామ‌ని పేర్కొంటూ ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయి కాబ‌ట్టి పని కోసం మళ్లీ వచ్చామ‌ని అంటున్నారు. కరోనా రాకుండా బాగుండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు అయితే...తాము చేసే పనిలో ఎలా ఉంటుందో తెలియదు కాబ‌ట్టి ఆ దేవుడినే నమ్ముకున్నామని ఓ వ‌ల‌స కూలీ మీడియాతో వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: