భార‌త‌ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు జెట్‌స్పీడ్‌తో పెరుగుతున్నాయి. ఊహ‌కంద‌ని విధంగా మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందుతోంది. రోజుకు సుమారు ప‌దివేల కేసులు న‌మోదు అవుతున్నాయి. అత్య‌ధిక కేసుల దేశాల జాబితాలో భార‌త్ పైపైకి ఎగ‌బాకుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ 5వ స్థానానికి చేరుకుంది . కేవలం 24 గంటల వ్యవధిలో రెండు దేశాలను దాటి ఐదో స్థానానికి చేరుకోవడం గమనార్హం. తొలుత శనివారం ఉదయం వరకు భారత్‌లో కేసులు 2,36,657కు చేరుకున్నాయి. దీంతో 2,34,531 కేసులు నమోదైన ఇటలీని అధిగమించి 6వ స్థానానికి చేరుకుంది. అయితే శనివారం రాత్రి నాటికి భారత్‌లో కేసులు 2,43,733కు పెరిగాయి. దీంతో 2,40,978 కేసులు నమోదైన స్పెయిన్‌ను సైతం అధిగమించి 5వ స్థానానికి ఎగబాకింది. ఇక మ‌ర‌ణాల్లో వైరస్‌కు కేంద్రబిందువైన చైనాలో 4,634 మరణాలు సంభ‌వించ‌గా భారత్‌లో 6,642 మరణాలు సంభ‌వించ‌గాయి.

 

తాజాగా పాజిటివ్‌ కేసుల పరంగా ఇటలీ, స్పెయిన్‌ దేశాలను దాటడాన్ని చూస్తే దేశంలో కరోనా తీవ్రత ఎంత ప్ర‌మాద‌క‌రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చున‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. కరోనా కేసుల పరంగా తొలి నాలుగు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్‌, రష్యా, బ్రిటన్‌ ఉన్నాయి. మరోవైపు భార‌త‌ దేశంలో శుక్రవారం నుంచి శనివారానికి 9,887 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 294 మంది కరోనా కారణంగా మరణించారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఉంది. భారత్‌లో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర కేసుల పరంగా ఏకంగా చైనానే అధిగమించబోతోంది. చైనాలో నమోదైన కేసులు 83,030 కాగా.. మహారాష్ట్రలో 80,229 కేసులు నమోదయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఒక‌టిరెండు రోజుల్లోనే మహారాష్ట్ర చైనాను దాటనున్నట్లు తెలుస్తున్నది. ఇక భారత్‌లో తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌ రాష్ర్టాల్లో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: