రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేసిన వాగ్దానాలను పెద్దగా గుర్తు పెట్టుకోరు. ఒకవేళ గుర్తు పెట్టుకున్నా.. ఎలాగూ ఐదేళ్లు పదవిలో ఉంటాం కదా.. మెల్లగా చేయొచ్చులే అనుకుంటారు. ఇప్పుడు వాగ్దానం అమలు చేసినా మళ్లీ ఓటేసే రోజుకు అది వారికి గుర్తుంటుందో లేదో అని సందేహపడతారు. కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు చేసేశానంటున్నారు.

 

 

అందులోనూ జగన్ ఇచ్చిన హామీల్లో ఎక్కువ పేదల గురించే. వారి ప్రాధమిక అవసరాలైన గూడు, తిండి కోసమే. వైఎస్ జగన్ త్వరలోనే 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు అందజేయబోతున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం అన్నది కొత్త విషయం ఏమీ కాదు.. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఇలా చేశారు. అయితే పట్టణ ప్రాంతాల్లోనూ ఇళ్ల స్థలాలు ఇవ్వడం మాత్రం జగన్ ప్రత్యేకత అంటున్నారు ఆయన మంత్రులు.

 

 

ఇంతకు ముందు నగరాల్లో, మున్సిపాలిటీ పరిధిలో ఇంటి స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవంటున్నారు. పట్టణాల్లో, నగరాల్లో కూడా ఇంటి స్థలం ఇస్తున్న ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. గజం రూ.30 వేలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంటి స్థలాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. హౌసింగ్‌ ప్రోగ్రామ్‌కి 25,842.10 ఎకరాల ప్రభుత్వ భూమిని, 16,078 ఎకరాల ప్రైవేట్‌ భూమిని సేకరించారు.

 

 

ఈ కార్యక్రమం కోసం దాదాపుగా 42 వేల ఎకరాల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సమకూర్చారట. లబ్ధిదారులు పెరిగినా వారి కోసం కూడా భూములు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు చెబుతున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రూ.6,500 కోట్లు కేటాయించి.. ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు వెచ్చించామంటున్నారు. ఏదేమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న జగన్.. ఈ పథకం వస్తున్న విమర్శలకూ బదులు చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: