ఏపీ సీఎం జగన్ మాటంటే మాటే.. సాధ్యమైనంత వరకూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారన్న పేరుంది. ఆయన గతంలో వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. కానీ.. అది అనేక కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఈలోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా కరోనా వచ్చింది.

 

 

ఇలా అనేక కారణాలతో ఈ కార్యక్రమం అమలు ఆలస్యమైంది. అందుకే జగన్ ఈ కార్యక్రమానికి తన తండ్రి జయంతి అయిన జూలై 8 ని ముహూర్తంగా నిర్ణయించారు.

ఆ లోగా 25 లక్షల మందికి పట్టాలు రెడీ చేసేలా అధికారులు శరవేగంగా పనులు కానిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు చేయాలంటే దాదాపు 40వేల ఎకరాల భూమి కావాలి. దీనికోసం ప్రభుత్వ భూములు సేకరించినా అన్ని చోట్లా అవి అందుబాటులో లేవు.

 

 

కొన్ని చోట్ల ప్రైవేటు భూములు కూడా సేకరించాల్సి వచ్చింది. ప్రభుత్వ భూముల సేకరణలోనూ ఎన్నో తలనొప్పులు ఉంటాయి. ఇప్పటికే ఆ భుూముల్లో ఉన్నవారు ఆందోళనలు చేస్తారు. వారిని సముదాయించాలి. నచ్చజెప్పాలి. ఇలాంటి ప్రాక్టికల్ ఇబ్బందులు ఎన్నో. అందుకే జూలై 8 నాటికి 25 లక్షల పట్టాలు ఇచ్చేందుకు అధికారులంతా తలమునకలయ్యారు.

 

 

జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాలు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించడంతో జిల్లాలో ఎమ్మార్వో స్థాయి అధికారి నుంచి కలెక్టర్‌ వరకు ఇప్పుడు అంతా ఇదే పనిలో ఉన్నారు. కమిషనర్లు మొదలు కొని ప్రిన్సిపల్‌ సెక్రటరీ వరకు పూర్తిగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపైనే నిమగ్నమయ్యారన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమం పెద్దగా ఇబ్బందులు లేకుండా సజావుగా సాగితే జగన్ కు అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: