తెలంగాణ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. పేద ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల నిమిత్తం 5,000 రూపాయల సాయం అందించనుంది. నిన్న ఛైర్మన్ సలీం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలొన్న సభ్యులతో చర్చించి వక్ఫ్ బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 49 అంశాల గురించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పేద ముస్లిం కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ సమావేశంలో హైదరాబాద్ లో హజ్ హౌస్ ఉత్తర, దక్షిణ భాగాలను అభివృద్ధి చేయాలని, ఖైరతాబాద్ లోని హకీం బషీర్ అహ్మద్ వక్ఫ్ స్థలాన్ని ఓపెన్ చేయాలని నిర్ణయం వెలువడింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఖైరతాబాద్ లోని హకీం బషీర్ అహ్మద్ వక్ఫ్ స్థలాన్ని లీజుకు ఇవ్వాలని వక్ఫ్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. పహాడీషరీఫ్ లోని శ్మశానవాటికకు స్థలాన్ని కేటాయించామని మహ్మద్ సలీం పేర్కొన్నారు. 
 
గంధంగూడ గ్రామంలో శ్మశానవాటిక సర్వేనంబర్‌ 81లో ఒక ముస్లిం వ్యక్తి మృతి చెందగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా తహశీల్దార్, వీ.ఆర్.ఏ అడ్డుకున్నారు. అంత్యక్రియలను అడ్డుకున్న సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ను వక్ఫ్‌బోర్డు కోరింది. శ్మశానవాటికల్లో మృతదేహాల ఖననంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పటు చేయనున్నట్టు వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది. 
 
వక్ఫ్ బోర్డ్ 5,000 రూపాయలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేయబోయే కమిటీ మృతదేహాల ఖననానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి వక్ఫ్ బోర్డుకు నివేదిక ఇవ్వనుంది. బోర్డు సభ్యులు అక్బర్‌ నిజాముద్దీన్‌ హుస్సేన్‌, జాకీర్‌ హుస్సేన్‌, మిర్జా అన్వర్‌బేగ్‌, జావిద్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: