దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న క‌రోనా జోరు లాగే తెలంగాణ‌లో క‌రోనా విస్తృతి పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిసిందే. ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా కొన్ని ప్ర‌యత్నాలు సాగుతున్నాయి. అయితే, తాజాగా ఓ ప్ర‌భుత్వ విభాగం చేస్తున్న ప్ర‌య‌త్నాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయ‌ని అంటున్నారు. ప్ర‌జా ర‌వాణాలో కీల‌క‌మైన టీఎస్‌ ఆర్టీసీలో నిబంధనల అమలును మాత్రం ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.  లాక్‌డౌన్‌ సడలింపులతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న బస్సులు ఇదే రీతిలో క‌రోనా వ్యా‌ప్తికి తోడ్పడుతున్నాయ‌నే కామెంట్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

 

 

కోవిడ్‌-19 వైరస్‌ విస్తరించకుండా బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌ ఆర్టీసీ కొన్ని నిబంధనలతో కంటైన్‌్‌మెంట్‌ జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి అనుమతులిచ్చారు. కానీ ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బస్సుల్లో ఎక్కడా నోటీసులు, స్టిక్కర్లు అంటించలేదు. కేవలం డిపోల్లో మాత్రమే సిబ్బంది కోసం పెట్టారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ నిబంధనలపై అవగాహనే కల్పించడం లేదు. ఒకరినొకరు మీటరు దూరం ఉండేలా భౌతికదూరం పాటిస్తూ సీట్లో ఒక్కరే కూర్చోవాలని నిబంధన ఉన్నా కొన్ని రూట్లల్లో సీటుకు ముగ్గురు చొప్పున కూర్చుంటున్నారు. ఆర్టీసీ సేవ‌లు ప్రారంభ‌మైన స‌మ‌యంలో ఇటీవల ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి తనిఖీలు నిర్వహించగా, కోదాడ డిపో బస్సులో శానిటైజర్‌ లేదని ఓ అధికారిని సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు చాలా బస్సుల్లో పాటించడం లేదు. అసలు బస్సునే శానిటైజ్‌ చేయడంలేదన్న విమర్శలున్నాయి. బ‌స్సులు ప్రారంభమైన మొదట్లో భయంతో ఎవరూ ఎక్కకపోవడంతో ఖాళీగా నడిచిన బస్సులు ఇప్పుడు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. భౌతికదూరం, మాస్క్‌, శానిటైజర్‌ లాంటి నియమాల ఊసే లేదని ఆరోపిస్తున్నారు.

 

 


నిబంధ‌‌నల‌ విష‌యంలో అమ‌లు పూర్తి భిన్నంగా ఉందంటున్నారు. ప్రతి ట్రిప్పును శానిటైజ్‌ చేయాలన్న నిబంధన ఉన్నా ఉదయం, సాయంత్రం మాత్రమే శానిటైజ్‌ చేస్తున్నారు. పైగా ఇలా చేయడం సాధ్యం కాదని అధికారులు పరోక్షంగా పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల సీట్లకు మాత్రమే స్ప్రే చేస్తున్నారు. కండక్టర్‌కు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఇవ్వాలి, బస్సులో ప్రయాణికులకు హ్యాండ్‌ శానిటైజ్‌ చేశాకే టికెట్‌ ఇవ్వాలని ఉన్నా ఇవేమీ పాటించడం లేదు. బస్సుల్లో ప్రయాణికులకు ఇవ్వడానికి రోజుకు ఒక బాటిల్‌ (50, 100 ఎంఎల్‌) ఇస్తున్నారనీ, ఇది సరిపోకపోవడంతో దాన్నే జాగ్రత్తగా వాడుతున్నామనీ ఖమ్మం జిల్లా కండక్టర్లు చెబుతున్నారు. బస్సు బస్టాండ్‌ల్లో బయలుదేరుతున్న సమయంలోనే ప్రయాణికులకు శానిటైజర్లు ఇస్తున్నారనీ, ఆ తర్వాత గ్రామాల్లో ఎక్కే వారికి ఇవ్వడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ఇస్తున్నామని చెబుతున్నారు. ఇక, అద్దె బస్సుల్లో శానిటైజర్‌తో శుభ్రం చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: