ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఈ ఏడాది కాలంలో వైసీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. గడచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి అంతగా జరగలేదని... సంక్షేమ పథకాల అమలు మాత్రం బాగా జరిగిందని రాష్ట్ర ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో భాగంగా అర్హులందరికీ ఇళ్లపట్టాలు అందజేస్తామని తెలిపింది. 
 
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనంతరం ఇళ్ల పట్టాల కోసం స్థలాలను సేకరించి మార్చి 25న ఉగాది పండుగ సందర్భంగా పంపిణీ చేయాలని భావించింది. స్థానిక సంస్థల ఎన్నికల వల్ల ఆ పథకం అమలు వాయిదా పడింది. ఆ తరువాత కరోనా విజృంభించడంతో జగన్ సర్కార్ జులై 8వ తేదీన వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని భావిస్తోంది. 
 
అయితే ఇదే సమయంలో టీడీపీ వైసీపీ నేతలు ఇళ్ల స్థలాల కోసం డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఇతర మంత్రులు ఇప్పటికే స్పష్టతనిచ్చారు. కానీ వైసీపీ, టీడీపీ నేతలు చేసుకుంటున్న విమర్శలు, చెబుతున్న లెక్కలు రాష్ట్రంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. 2014 - 2019 టీడీపీ పాలనలో 29.52 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని... 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని.... మిగిలిన ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని టీడీపీ చెబుతోంది. 
 
చంద్రబాబు అధికారంలో ఉన్న 1999 - 2004 మధ్య కాలంలో 6.85 లక్షల ఇళ్లు కట్టారు. 2004 - 2009 మధ్య కాలంలో 24.18 లక్షల ఇళ్లు కట్టారు. 2009 - 2014 మధ్యకాలంలో 11.13 లక్షల ఇళ్లు కట్టారు. సీఎం జగన్ ఐదేళ్లలో రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు కట్టాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో 69 లక్షల కుటుంబాలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. రాష్ట్రంలో జగన్ 30 లక్షల ఇళ్లతో కలిపితే కోటి ఇళ్లు ప్రభుత్వాలు ప్రజలకు మంజూరు చేసినట్లు అవుతుంది. ఏపీలో ఇంతమంది పేదలున్నారా...? నిజంగానే పేదలకు ప్రభుత్వం నుంచి ఇళ్లు అందుతున్నాయా...? అనే ప్రశ్నలు నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: