తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఇది మ‌రింత ఉధృతం అయింది. సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అక్ర‌మ నిర్మాణం చేప‌ట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌లో ఫిర్యాదు చేయ‌డం, దానిపై ద‌ర్యాప్తున‌కు క‌మిటీ ఏర్పాటు చేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే, ఈ ప‌రిణామంపై తాజాగా టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ త‌మ‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా రేవంత్ ఆరోపణలు చేశారని మండిప‌డ్డారు. 

 

 

గోపన్‌పల్లిలో దళితుల భూములను లాక్కున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించిన బాల్క సుమ‌న్ దానిపై ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నించారు. ``ఎదుటి వాడిపై బురద జల్లటం రేవంత్ రెడ్డికి అలవాటే. 111 జీవో పరిధిలోకి వ‌చ్చే వట్టి నాగులపల్లి లో రేవంత్ బాగోతం బయట పెడుతున్నాం. సర్వే నెంబర్ 66/ఈ లో రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాష్ రెడ్డి  అక్రమ కట్టడాలు కడుతున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి`` అని డిమాండ్ చేశారు. 111 జీవో పరిధిలో ఎవరెవరికి భూములున్నాయో బయట పెడతామ‌ని తెలిపారు. ``రేవంత్ చూపెట్టిన భూములు కేటీఆర్‌వి కావు. కేటీఆర్‌ ఎదుగుదలను జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారు. త్వ‌ర‌లో రేవంత్ వ్యవహారాలు ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. వట్టి నాగులపల్లిలో నీ పేరు..మీ బంధువుల పేర్ల మీద ఉన్న భూములపై ముందు సమాధానం చెప్పు`` అని ప్ర‌శ్నించారు.

 

 

ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ సంచలనాల కోసమే రేవంత్ మాట్లాడతారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమ‌ని మండిప‌డ్డారు. ``జాతీయ పార్టీ కి ఇలాంటి నాయకుడి అవసరం ఉందా..? ఆలోచించండి. టీఆర్ఎస్‌ నాయకులం ధర్మానికి కట్టుబడి ఉన్నాం. కోర్టులంటే మాకు గౌరవం ఉంది. ప్రజలంతా ఒకవైపు ఉంటే... రేవంత్ టీం అంతా ఓవైపు. రేవంత్ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం మానుకోవాలి. కేటీఆర్‌ ఫార్మ్ హౌస్ విషయాలు చాలా సార్లు చెప్పారు. 111 పరిధిలో మా పార్టీ నాయకుల ఫార్మ్ హౌస్ లు ఉన్నాయని కాంగ్రెస్ నేత వీహెచ్‌ చెప్పారు దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి `` అని డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: