మరో నెల గడిస్తే ఆ ఇంట్లో చిన్నారి కేరింతలు వినిపించేవి. ఆ దంపతుల అన్యోన్యతకు ఒక ప్రతిరూపం కళ్ల ముందు కదలాడేది. ఇంతలోనే ఆమె కడుపులోని బిడ్డ కాస్తా కలవరపెట్టాడు. వెంటనే ఆమె భర్త ఆసుపత్రి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం ఆ గర్భిణిని చేర్చుకునేందుకు నిరాకరించాయి. ఎనిమిది ఆసుపత్రుల చుట్టూ తిప్పాడు. 13 గంటల నరకయాతన అనుభవించింది. ఆఖరుకు అంబులెన్సులోనే మరణించింది. ఉత్తరప్రదేశ్‌..నోయిడా పరిధిలో చోటు చేసుకుంది  ఈ హృదయ విదారకర ఘటన.

 

ఉత్తరప్రదేశ్ లోనూ గద్వాల జిల్లాలో జరిగిన లాంటి ఘటన చోటుచేసుకుంది. గద్వాల జిల్లాలో ఆ మధ్య ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావటంతో భర్త ఆమెను తీసుకొని ఆస్పత్రికి బయల్దేరాడు. ఐదారు ఆస్పత్రుల చుట్టూ తిప్పాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు డాక్టర్లు నిరాకరించారు. ఆఖరుకు గర్భిణికి సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు అచ్చుగుద్దినట్లుగా ఇలాంటి ఘటనే ఒకటి యూపీలో జరిగింది. గౌతమ్‌బుద్దనగర్‌ జిల్లాలోని కోడా కాలనీలో నివాసముంటున్న వీజేందర్‌సింగ్‌, నలీమ్‌ భార్యభర్తలు. ఎనిమిదో నెల గర్భిణిగా ఉన్న నలీమ్‌కు అనుకోకుండా పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో భర్త వీజేందర్‌సింగ్‌ అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మొదట ఒక ఆసుపత్రికి వెళ్లగా వారు సరిపడా బెడ్స్‌ లేవని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అలా మొత్తం 13 గంటల్లో ఎనిమిది ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. చివరికి నలీమ్‌ నొప్పులు తాళలేక ఆంబులెన్సులోనే మరణించింది. 

 

తొలుత మేము ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లామని నలీమ్ భర్త విజేందర్‌సింగ్ తెలిపాడు. వారు నిరాకరించడంతో సెక్టార్ 30లోని చైల్డ్‌ పీజీఐ ఆసుపత్రికి, అక్కడి నుంచి షర్దా, గవర్నమెంట్ ఇన్‌సిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లకు తీసుకెళ్లామని చెప్పాడు. అయితే...డాక్టర్లు తన భార్యను చేర్చుకునేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రులైన జేయ్‌పీ, ఫోర్టీస్‌, మాక్స్‌ ఇన్‌ వైశాలిను ఆశ్రయించగా.. వారూ చేర్చుకోలేదని అన్నాడు. ఇలా 13 గంటలు అంబులెన్సులో తిరిగాక చివరకు జిమ్స్‌లోనే ఆమెను చేర్పించానని కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది అంటూ గుండెలవిసేలా విలపించాడు నలీమ్ భర్త వీజేందర్ సింగ్.

 

ఇక...దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాలలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఘటనపై స్పందించిన జిల్లా పాలనాధికారి సుహాస్‌ ఎల్‌వై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ముఖ్య వైద్యాధికారి అయిన మునీంద్ర నేతృత్వంలో ఘటనకు కారణమైన ఆసుపత్రులపై విచారణ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇలా జరగడం ఇది రెండోసారి. గతంలో మే 25న ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆస్పత్రుల నిర్లక్ష్యానికి ఒక పసికందు మరణించింది. ఆ మధ్య తెలంగాణ రాష్ట్రం...గద్వాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మొత్తానికి ఆస్పత్రి యాజమాన్యాల అరాచకాలకు నిండు ప్రాణాలు బలి కావటం విషాదంగా మారుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: