ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. 18న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 30తో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కాలం చెల్లనుండడంతో.. కచ్చితంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.

 

రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు.. ఈనెల పదహారు నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చిలో ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టినందున, ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను  ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ పరిరక్షణ బిల్లుతో పాటు, మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

 

సమావేశాల తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ హరిచందన్ ప్రసంగించనున్నారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడిన తర్వాత,  బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశమై.. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? తదితర అంశాలను ఖరారు చేయనుంది.18వ తేదీన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇంతకుముందే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో సమావేశాలను ప్రభుత్వం వాయిదా వేసింది. నాలుగు నెలల పాటు ఆర్డినెన్స్ ద్వారా బడ్డెట్‌ను ఆమోదింపజేసుకున్నారు. 

 

ఈనెల 30తో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌కు కాలం చెల్లనుండడంతో..ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.19న రాజ్యసభ ఎన్నికలుఉండడంతో.... ఎమ్మెల్యేలందరూ రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంది. ఫలితంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16 నుంచి నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. కరోనా విజృంభిస్తుండడంతో వీలైనన్ని తక్కువరోజులు.. అసెంబ్లీ సెషన్స్ నిర్వహించే అవకాశమునట్లు తెలుస్తోంది.

 

మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇటు అధికార పక్షం.. అటు ప్రతిపక్షం సభలో ప్రస్తావించే విషయాలపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చూపిన చొరవ.. వైఫల్యాలను లేవనెత్తే అంశాలపై ప్రతిపక్షాలు  కసరత్తు చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: