తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు మేలు చేసే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అన్న‌దాత‌ల సంక్షేమం విష‌యంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్న ప్ర‌భుత్వం తాజాగా నకిలీ విత్తనాల నుంచి రైతులను కాపాడేందుకు మ‌రో ముంద‌డుగు వేసింది. వ్యవసాయశాఖ ఆధ్వ‌ర్యంలో కీల‌క టెక్నాల‌జీతో రైత‌ల‌కు అందే సేవ‌లు మ‌రింత సుల‌భం చేవారు. న‌కిలీ విత్త‌నాల‌కు చెక్ పెట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానం ప్రవేశ‌పెట్టారు. త‌ద్వారా న‌కిలీ విత్త‌నాల‌కు చెక్ ప‌డ‌నుంది.

 

రైతుల‌కు అమ్మే విత్తనాలు ఎక్కడ, ఎవరు తయారు చేశారు?ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? అనే వివరాలు రైతులే తెలుసుకొనేలా వ్య‌వ‌సాయ శాఖ‌ చర్యలు చేపట్టింది. విత్తన సంచులపై క్యూఆర్‌ కోడ్‌ను, ట్రేసబిలిటీ కోడ్‌ను ముద్రించాలని నిర్ణయించింది. వ్యవసాయశాఖ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విత్తన ధ్రువీకరణ అథారిటీ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణ‌యంతో విత్త‌న మోసాల‌కు చెక్ ప‌డ‌నుంది.

 

ఇదిలాఉండ‌గా, రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్న ముఠాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలతో నకిలీ విత్తన కేటుగాళ్ల పనిపడుతున్నది. నకిలీలకు చెక్‌ పెట్టేందుకు పీడీ యాక్ట్‌లను నమోదు చేస్తున్నది. ఏపీలోని కర్నూలు, గుంటూరుతోపాటు మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, యూపీల నుంచి నకిలీ పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి పెద్దఎత్తున వస్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నకిలీ విత్తన ముఠాల ఆగడాలు ఎక్కువయ్యాయి. వీరికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రస్థాయిలో పోలీస్‌, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆరు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటుచేశారు. వీటికి పోలీస్‌శాఖ తరఫున నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ బృందాలు రాష్ట్ర, జిల్లా, జోన్‌, మండలస్థాయిలో తనిఖీలు చేపడుతున్నాయి.  హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువగా విత్తన ప్రాసెసింగ్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలే  కేంద్రాలుగా ముఠాలు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: