రాజ‌కీయ నాయ‌కులు రాజ‌కీయాలు కాకుండా మ‌రేం చేస్తారు?  రాజ‌కీయాలు చేయ‌డంలో త‌ప్పేం లేదు. కానీ మంచి ప‌నుల విష‌యంలో కూడా వెట‌కారాలు, అన‌వ‌స‌ర కామెంట్లు మాట్లాడ‌టం అనేది నాయ‌కుల స్థాయిని త‌గ్గించుకుంటుంది. ఆ పార్టీపై అభిమానం ఉన్న‌వారిని కూడా ఆందోళ‌న‌లో ముంచుతుంది. తాజాగా దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైని క‌లిగి ఉన్న మ‌హారాష్ట్ర పాల‌కుల విష‌యంలో అదే జ‌రుగుతోంది. లాక్ డౌన్ స‌మ‌యంలో వలస కూలీల విష‌యంలో మంచిలో కూడా త‌ప్పును వెతుకుతూ న‌టుడు సోనూసూద్‌పై మ‌హారాష్ట్రలో అధికారంలో ఉన్న‌ శివ‌సేన పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించింది.

 

 

క‌రోనా వ్యాప్తి కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేయడంలో మానవత్వం ప్రదర్శించి, అందరితో శభాష్ అనిపించుకుంటున్న వ్య‌క్తి సినీ న‌టుడు సోనూ సూద్‌పై. ఆయ‌న్ను దేశ‌వ్యాప్తంగా ప్రాంతాలు, పార్టీల‌కు అతీతంగా ప్ర‌జ‌లు అభినందించారు. అయితే, మ‌హారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన మాత్రం విమ‌ర్శ‌లు సంధించింది. శివ‌సేనకు చెందిన ప‌త్రిక 'సామ్నా' వేదికగా తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. ఎప్ప‌ట్లాగే ఆ పార్టీ త‌ర‌ఫున మీడియ వ‌ద్ద నోరు పారేసుకునే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఘాటుగా రియాక్ట‌య్యారు.

 

 

సోనూసూద్ త్వరలోనే ప్రధాని మోదీని కలిసి 'సెలెబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబై' అయిపోతారని సోనూసుద్‌ మండిప‌డ్డారు. కరోనా క‌రాళ నృత్యం చేస్తున్న‌వేళ దేశంలో 'కొత్త మహాత్ముడు' ఊడిపడ్డాడని వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. గవర్న‌ర్ కోశ్యారీ కూడా 'మహాత్మా సూద్' అని ప్రశంసించారని సంజ‌య్‌రౌత్ గుర్తు చేశారు. లాక్‌డౌన్ కాలంలో సోనూసూద్ లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారని, అయితే లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ సమయంలో ఆయ‌న అన్ని బస్సులను ఎలా స‌మ‌కూర్చారో  ఎవరూ ప్రశ్నించలేదని విమ‌ర్శ‌లు చేశారు. లాక్‌డౌన్ కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను రాష్ట్రాల్లోకి అనుమతించలేదని, అలాంటి సమయంలో సోనూసూద్ పంపిన కార్మికులు ఎక్క‌డికి వెళ్లారో చెప్పాలని రౌత్ ప్ర‌శ్నించారు. సోనూసూద్ చాలా మంచి నటుడని, మంచిప‌నే చేశాడ‌ని, కానీ ఆ ప‌ని వెనుక ఎవరో రాజకీయ దర్శకుడు ఉండే ఉంటాడ‌ని రౌత్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: