రేపట్నుంచి ఢిల్లీ సరిహద్దులు తెరుస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. రెస్టారెంట్లు, మాల్స్ కు అనుమతిస్తామని, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

దేశరాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్నట్టు ఆప్ సర్కార్ ప్రకటించింది. సరిహద్దులు తెరుచుకోనున్నాయి. అన్ని మాల్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేయనున్నారు. అయితే హోటల్స్, బ్యాన్ క్వీట్ హాల్స్ తెరవడానికి వీలులేదు. ఇదిలా ఉంటే మందుబాబులకు ఊరట కలిగించేలా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. రేపటి నుంచి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న అన్ని బార్లు ఓపెన్ కానున్నాయి. జూన్ 10 నుంచి లిక్కర్‌పై ఉన్న ప్రత్యేక కరోనా ఫీజును కూడా తొలగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా లిక్కర్‌పై ప్రత్యేక కరోనా ఫీజు వసూలు చేస్తున్నారు. 

 

ప్రజలందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న కరోనా సోకినవారిలో 60 నుంచి 70 శాతం మంది ఢిల్లీ వాసులు కాదని సీఎం అన్నారు. ఢిల్లీలో ఉన్న ఆస్పత్రులు కేవలం ఢిల్లీ వాసులకోసమేనని, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు అందరికోసమని తెలిపింది. ఢిల్లీలో ఈ నెల చివరి వరకు 15 వేల పడకలు అవసరం ఉన్నాయని, సడలింపుల నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 

 

కొవిడ్‌ మహమ్మారి కాటుకు ఢిల్లీ విలవిల్లాడుతోంది. ప్రతిరోజు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడంతోపాటు మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. గడచిన 24గంటల్లో కొత్తగా 1320 పాజిటివ్‌ కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27 వేల 654కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 761మంది మృత్యువాతపడ్డారు. దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో దిల్లీ మూడో స్థానంలో ఉంది. అయితే, ఈ కేసుల సంఖ్య జూన్‌ చివరినాటికి లక్ష దాటే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ అంచనా వేసింది. కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో.. వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రస్తుతం ఉన్న వైద్య పడకలకు అదనంగా మరో 15వేల పడకలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జులై 15నాటికి దాదాపు 42వేల పడకలు అవసరమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. 

 

కరోనా కేసులు, నిర్ధారణ పరీక్షల్లో ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ప్రభుత్వం హెచ్చరించింది. బెడ్ల కొరత సృష్టించే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవని కేజ్రీవాల్ హెచ్చరించారు. మరోవైపు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వైద్యులను, ఆసుపత్రులను బెదిరిస్తున్నారంటూ వైద్య సంఘాలు ఆరోపించాయి. ఈ సమయంలో గంగారాం ఆసుపత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని ఖండిస్తూ ఢిల్లీ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: