కరోనా సంక్షోభానికి చైనాయే కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. అక్కడి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కరోనా విషయంలో తాము సమయానుకూలంగా, వేగంగా స్పందించామంటూ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంది. సంక్షోభం తలెత్తిన నాటి నుంచి చైనాలో తీసుకున్న చర్యలపై కమ్యూనిస్టు ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది.

 

తొలి కోవిడ్ కేసు నమోదైన నాటి నుంచి పకడ్బందీ చర్యలు చేపట్టామని, ప్రపంచానికి, డబ్ల్యూహెచ్ఓకూ ఎప్పటికప్పుడు సమాచారం అందించామని చైనా స్పష్టం చేసింది. కరోనా మహమ్మారికి ప్రబలడానికి తాను కారణం కాదని చెప్పకనే చెప్పింది. కరోనాపై చైనా శ్వేతపత్రం ప్రకటించింది. కరోనాను పోలిన తొలి కేసు డిసెంబర్ 27 వుహాన్‌లో బయటపడింది. దీంతో హూబే ప్రావిన్స్‌లోని స్థానిక ప్రభుత్వం వెనువెంటనే అంటువ్యాధుల నిపుణులను రంగంలోకి దింపింది. ల్యాబొరేటరీ పరీక్షల ఫలితాలు, పేషెంట్ల స్థితిగుతులను వారి సహాయంతో విశ్లేషించింది. తర్వాత నిపుణులు దీన్ని వైరల్ న్యుమోనియాగా గుర్తించారు. మనుషుల ద్వారా వ్యాపించే వ్యాధి అని జనవరి 19న చైనా జాతీయ ఆరోగ్య నిపుణులు తొలిసారిగా గుర్తించారు. అదే రోజు బహిరంగంగా వివరాలు ప్రకటించారు. 

 

నెల రోజుల్లోపే కరోనాకు సంబంధించిన వివరాలన్నీ చెప్పామని చైనా తెలిపింది. జనవరి ప్రకటనకు ముందు ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాపిస్తుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని చైనా చెప్పింది. నిపుణుల బృందం వుహాన్ చేరుకునే సమయానికే రోగుల సంఖ్య పెరిగిపోయిందని, అయితే రోగుల్లో ఎవరికీ వెట్ మార్కెట్‌తో సంబంధం ఉన్నట్టు తేలలేదని చైనా చెప్పుకొచ్చింది. అడవి జంతువుల నుంచి వైరస్ మనుషులకు పాకినట్టు ప్రపంచ మంతా భావిస్తున్న తరుణంలో.. చైనా శ్వేతపత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది. హూబే ప్రావిన్స్, దానికి కేంద్రమైన వుహాన్‌లో వ్యాధి కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక ప్రభుత్వాలకు జనవరి 14నే సూచించామని చైనా తెలిపింది. ఇది మనుషుల ద్వారా సంక్రించే వ్యాధి అంటూ ప్రభుత్వం జనవరి 20న ప్రకటించింది. 

 

ఓ అంటు వ్యాధి వుహాన్‌లో ప్రబలుతోందని, ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని తెలియగానే దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి పటిష్ట కార్యాచరణ అవలంబించినట్టు చైనా ప్రభుత్వం శ్వేత పత్రంలో వెల్లడించింది. జనవరి 3 నుంచీ అంటే.. కరోనాను ఓ వైరల్ నిమోనియా వ్యాధిగా భావిస్తున్నప్పటి నుంచీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు, ఆ తరువాత అమెరికాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించామని తేల్చేసింది. ఇక కరోనా కట్టడిలో ముఖ్యపాత్ర పోషించారని చైనా అధినేత షీ జింగ్‌పింగ్‌పై కూడా శ్వేత పత్రం ప్రశంసల వర్షం కురిపించింది. కరోనా కట్టడి చైనా సాధించిన వ్యూహాత్మక విజయంగా అభివర్ణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: