ఏపీలో ఇసుక సమస్య తీవ్రంగా ఉంది. జగన్ పాలన మొదలైన దగ్గర నుంచి ఎక్కువగా విమర్శల పాలైంది ఈ ఇసుక విషయంలోనే.. ఇసుక బుకింగ్ ఆన్ లైన్ చేసినా విమర్శలు తప్పడం లేదు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ లు నిర్వహించేందుకు నిర్ణయించారు.

 

 

ఇసుక సమస్యపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం వుంటుంది. వినియోగదారులు సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకున్నట్లయితే స్థానికంగా వున్న సచివాలయ వ్యవస్థ ద్వారా నిజమైన అవసరానికే సదరు బుకింగ్ జరుగుతోందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. నిర్ధారించుకునేందుకు అవకాశం వుంటుంది.

 

 

ఈ సదుపాయం వల్ల అవసరం లేని వారు కూడా ఇసుకను బుక్ చేసి, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే అవకాశం వుండదు. ఇసుక సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ తరువాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలను మరింత వేగవంతం చేసింది. ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే రోజుకు మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

 

 

అంతే కాదు... గుర్తించిన వాటర్ స్ట్రీమ్ ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలు ఉచితంగా ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా పొందే అవకాశం కల్పించారు. దీనివల్ల జలవనరుల సమీపంలోని ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. ఇసుక బుకింగ్ లపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,53,197 మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వితీశారు. దానిలో డోర్ డెలివరీ ద్వారా 33,28,553 ఎంటిలు, ఇతర వినియోగదారులకు 53,57,003 ఎంటిలు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: