తెలంగాణ‌లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వంపై జ‌రుగుతున్న ప్ర‌చారం, వివిధ అంశాల‌పై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పీపీఈ కిట్లు, ఎన్‌- 95 మాస్కులు లేనందువల్లే వైద్యులు, సిబ్బందికి కరోనా సోకిందంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇంకో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స అందిస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇంట్లోనే కరోనా చికిత్సకు ప్రజలంతా సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.

 

క‌రోనా కేసుల విస్తృతి గురించి వివ‌రిస్తూ...జీవనోపాధి కోల్పోకూడదని మాత్రమే లాక్‌డౌన్‌ ఎత్తివేశామ‌ని ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. ``అవసరం లేకుండా బయటికి వచ్చి ప్రాణాలమీదకి తెచ్చుకోవద్దు. ప్రజలు ఎక్కువగా బయటకు రావడంతో కరోనా వ్యాప్తి పెరిగింది. వృద్ధులకు, ఆరోగ్య సమస్యలున్నవారికి కరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కరోనా సోకకుండా ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలి. ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య పెరిగితే ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ హైదరాబాద్‌లో చికిత్స అందించడం అసాధ్యం. జిల్లా కేంద్రాల్లోనే ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిలోనే కరోనా చికిత్స అందిస్తామని' మంత్రి పేర్కొన్నారు.

 

కాగా, క్వారంటైన్‌ కేంద్రాల్లో సరైన వసతులు లేవని కొందరుచేస్తున్న అనవసర ఆరోపణలు వైరస్‌పై పోరుకు ఆటంకంగా మారాయని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోపణల్లో నిజం ఉంటే వాస్తవాలను బయట పెట్టాలని, ప్రజల పట్ల ప్రేమ ఉంటే సరైన సూచనలు చేయాలని మంత్రి ఈట‌ల‌ హితవు పలికారు. అమెరికా లాంటి దేశంలో మూడు శాతం వైద్యులకు కరోనా సోకిందని, రాష్ట్రంలోని వైద్యులు, ఇతర సిబ్బంది పట్ల ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందుకోసం కిందిస్థాయిలోని వైద్య సిబ్బందికి, పోలీసులకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి హెచ్‌సీక్యూ మందులు నిర్ణీత డోసుల్లో వేసుకొనేలా పంపిణీ చేశామన్నారు. కొన్ని శస్త్ర చికిత్సలను వాయిదా వేయొచ్చు కానీ, డెలివరీలు వాయిదా వేయలేమని.. ఈ పరిస్థితిలో కరోనా చికిత్స అందించే వారే కాకుండా ప్రసవాలు చేసే వైద్యులు సైతం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని తెలిపారు. కరోనా సోకిన వైద్యులు, ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామన్నారు. పాజిటివ్‌ ఉన్నా కొందరు వైద్యులు ప్రస్తుత సమయంలో పనిచేయడం తమ బాధ్యత అంటూ ముందుకు వస్తున్నారని, అటువంటివారిని ప్రోత్సహించడం అవసరమని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: