అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెత చందంగా ఉంది ఇప్పుడు శివసేన పరిస్థితి. కరోనా కారణంగా పెద్ద ఎత్తున వలస కార్మికులు పడుతున్న కష్టాలను చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలంతా కలవరం చెందారు. అకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ కారణంగా రవాణా తో పాటు అన్ని పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో వలస కూలీలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు తినేందుకు తిండిలేక, చేసేందుకు పని లేక తమ సొంత ఊరిలోనే ఏదో ఒకటి చేసుకుందామనే ఉద్దేశంతో నడక బాట పట్టడం, మార్గమధ్యంలో అనేక ఇబ్బందులు పడటం, మరికొందరు మార్గమధ్యలో మృతి చెందడం వంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఆవేదనను మిగిల్చాయి. ఈ విషయం అంతర్జాతీయ మీడియాలో సైతం ఫోకస్ అయింది. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థలు వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావడం వంటి సంఘటనలు జరిగాయి.

 

ఆ విధంగానే ఆ సమయంలో వలస కార్మికులకు ప్రత్యక్షదైవంగా నటుడు సోనూ సూద్ కూడా తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించారు. రోజుకు సుమారు 40 వేల మందికి పైగా వలస కార్మికులకు భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు, వారికి రవాణా సౌకర్యాలు కల్పించి వారి సొంత గ్రామాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బస్సులు, విమానాలు, రైళ్లు అన్నిటిని సొంతంగా సమకూర్చి సోనూసూద్ వలస కార్మికుల పాలిట దేవుడిగా మారాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయనకు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఇక్కడే అసలు రాజకీయం బయటపడింది. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న వంటి కారణాలతో శివసేన ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలవుతోంది. కరోనా సమయంలో సీఎం ఉద్ధవ్ థాకరే అనుభవ రాహిత్యం కూడా మహారాష్ట్ర శాపంగా మారిందని, దేశ వ్యాప్తంగా అత్యధిక మరణాలు కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర వార్తల్లోకెక్కింది.

 

దేశవ్యాప్తంగా 2.47 లక్షల కరోనా కేసులు ఉంటే, అందులో 83 వేల కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పరిపాలన కోణంలో కాకుండా వలస బాధితులకు సహకారాలు అందిస్తున్న వారిపై కక్ష పెంచుకుంది శివసేన. అసలు సోనూసూద్ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి కార్మికులను స్వస్థలాలకు చేరుస్తున్నాడు. ఒక ప్రత్యేక ఫ్లైట్ బుక్ చేసి 166 మందిని ఇప్పటికే స్వస్థలాలకు పంపించారు. తాజాగా ముంబై నుంచి డెహ్రా డూన్ కి 173 మందిని ఈ విధంగానే తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఇక వందల కొద్దీ బస్సులను ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. అలాగే తన విలాసవంతమైన ఇంటిని కూడా హాస్పిటల్ గా వాడుకోవాలంటూ ప్రభుత్వానికి అప్పగించిన నిజమైన హీరో అనిపించుకున్నాడు. ఇది ఇలా ఉంటే శివ సేన అధికార పత్రిక సామ్నాలో వివాదస్పద నేత ఎంపీ సంజయ్ రౌత్ సోనూసూద్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమవుతోంది.

 

ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే ...సోను సూద్ లాక్ డౌన్ సమయంలో బస్సులు ఎలా దొరుకుతున్నాయి. ముంబై సెలెబ్రెటీ అవ్వాలని అనుకుంటున్నాడా.. వచ్చాడయ్యో కొత్త మహాత్ముడు, అసలు దీని వెనుక ఎవరో రాజకీయ దర్శకుడు ఉండే ఉంటాడు అంటూ సోను సూద్ సేవలపై ఉన్న తమ ఆగ్రహాన్ని శివసేన బయటపెట్టింది. అంటే సోను సూద్ వెనుక బీజేపీ ఉంది అనేది శివసేన అభిప్రాయం. దీంతో ఆయనపై తాజాగా ఈ విమర్శలు చేయడం వైరల్ గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోగా కొలుస్తున్న సోనూసూద్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏది ఏదేమైనా ఈ వివాదం శివసేన ఎక్కడలేని అపఖ్యాతిని మూటగట్టకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: