కేంద్రం లాక్ డౌన్ లాక్ డౌన్ కు నిబంధనలు సడలిస్తూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కాయి. రెండు రాష్ట్రాల్లో పలు పట్టణాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో బస్సులు నడుస్తున్నాయి. కేంద్రం అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా అనుమతులు ఇచ్చింది. ఏపీలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు నడపనున్నట్టు వార్తలు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. 
 
పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల బస్సు సర్వీసులను అనుమతించడం లేదు. ఏపీ సీఎస్ నీలం సాహ్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతించాలని లేఖలు రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ ఇప్పటికే అంతర్రాష్ట్ర సర్వీసులను తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ లేఖపై ఇంకా స్పందించాల్సి ఉంది. 
 
త్వరలోనే ఏపీకి చెందిన బస్సులను అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ఇతర రాష్ట్రాల బస్సులను అనుమతించే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.      
 
కర్ణాటకలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పట్లో కర్ణాటక ఇతర రాష్ట్రాల బస్సు సర్వీసులను అనుమతించే పరిస్థితి లేదని తెలుస్తోంది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల గురించి గందరగోళం నెలకొని ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్‍ టాస్క్‌ఫోర్స్ చైర్మన్‍ కృష్ణబాబు స్పష్టత ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నామని... ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే బస్సు సర్వీసులు నడుపుతామని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: