కరోనా వైరస్ నియంత్రణకు టీకా తయారు చేయటంలో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అమెరికా వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా బ్రిటన్‌ ఫార్మాస్యూటికల్ సంస్థ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించినట్లు వెల్లడించింది.  

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది అన్ని దేశాలను కలవరపెడుతోంది. కరోనా మహమ్మారి బ్రిటన్‌లోనూ విజృంభిస్తోంది. ఇలాంటి తరుణంలోనే బ్రిటన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సైంటిస్టులతో కలిసి భారీ ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  


 
అయితే అది ఇంకా పరీక్షల దశలోనే ఉంది. అయినప్పటికీ వ్యాక్సిన్‌ను భారీ ఎత్తున ఉత్పత్తి కూడా చేస్తోంది. సెప్టెంబరు నాటికి వంద మిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే నెలలో కరోనా వ్యాక్సిన్‌ తొలి డెలివరీ ఇచ్చేందుకు బ్రిటన్‌కు చెందిన ఔషధ సంస్థ అస్ట్రాజెనెకా సన్నాహాలు ప్రారంభించింది. ఒకవేళ ఈ వ్యాక్సిన్ ప్రభావం చూపించగలదని నిరూపితమైతే తర్వాత వచ్చే డిమాండును అందుకోవటానికి అస్ట్రాజెనెకా ఇప్పటి నుంచే డోసులు తయారు చేయటం ప్రారంభించింది. తాము ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఇప్పుడే ప్రారంభిస్తున్నామని తెలిపింది బ్రిటన్ ఔషధ సంస్థ. పరీక్షల ఫలితాలు వచ్చే సమయానికి ఉపయోగించడానికి అది రెడీగా ఉండేలా ఈ టీకాను సరఫరా చేయాలని ఆస్ట్రాజెనెకా లక్ష్యంగా పెట్టుకుంది.

 

అస్ట్రాజెనెకా ఈ టీకా సగం డోసులను దిగువ, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేసేందుకు అంగీకరించింది. అయితే...వ్యాక్సిన్ తయారీ నిర్ణయంలో రిస్క్ ఉంటుందని తమకు తెలుసని అస్ట్రాజెనెకా అంగీకరించింది. ఐతే...అది ఆర్థికపరమైన నష్టమేనని...అది కూడా వ్యాక్సిన్ పనిచేయకపోతేనే ఆ నష్టం వస్తుందని అభిప్రాయపడింది. అలాంటి సమయంలోనే తాము తయారు చేసిన పదార్థాలు, వ్యాక్సిన్లూ వృథా అవుతాయని తెలిపింది. మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి, లాభాలు ఆర్జించాలని కోరుకోవడం లేదని బ్రిటన్ ఔషధ సంస్థ అస్ట్రాజెనెకా స్పష్టం చేసింది.

 

మరోవైపు...కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయటంలో అమెరికా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు. రక్షణపరమైన తనిఖీలు పూర్తయితే, కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 2021 ప్రారంభానికి కొన్ని మిలియన్‌ డోసుల వ్యాక్సిన్లు అమెరికా వద్ద ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న ఐదు కంపెనీలను ట్రంప్ ప్రభుత్వం ఎంపిక చేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రకటించింది.  

 

మొత్తానికి...కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు ప్రపంచంలోని అగ్రదేశాలు పోటీ పడుతున్నాయ్. ప్రయోగాలు విజయవంతమైతే...త్వరలోనే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: