జమ్ము కశ్మీర్ లోయలో భద్రతా బలగాలకు మరో విజయం దక్కింది. రిబాన్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఐదుగురు టెర్రరిస్టులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ నెల 1న ఎల్‌ఓసీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులను ఇండియన్ ఆర్మీ అంతమొందించింది.   

 

జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జైనాసోరా సమీపంలోని రెబాన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా  ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో కశ్మీర్ లోయలో భారత భద్రతా దళాలకు ఘనవిజయం దక్కినట్లయింది. రిబాన్ ప్రాంతంలో మిలిటెంట్లు నక్కి ఉన్నారన్న సమాచారంతో బలగాలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. జవాన్ల రాకతో పారిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీరి కాల్పులను దీటుగా ఎదుర్కొన్న భారత దళాలు ఐదుగురినీ అంతమొందించాయి. 

 

ఇక...ఈ నెల 1న సరిహద్దులో ఓ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. భారీ ఆయుధాలతో ముగ్గురు ముష్కరులు జమ్మూలోని నియంత్రణా రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించారు. వీరు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వస్తున్నట్లుగా గుర్తించిన భద్రతా బలగాలు..సరిహద్దులోని కలాల్‌ గ్రామం వద్ద వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఐతే...ముష్కరులు కాల్పులకు తెగబడటంతో దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. ఆ సమయంలో వారి వద్ద భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. 

 

మరోవైపు అదే రోజు భారీ నార్కో-టెర్రర్‌ మాడ్యూల్‌‌ను జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఛేదించారు. ఆరుగురు నార్కో ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీరికి జైషే మహ్మద్‌ సంస్థతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

 

మొత్తానికి...భారత సరిహద్దు ప్రాంతాల్లో వరుస ఎన్‌కౌంటర్లు జరగటం కలకలం రేపుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: