తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్నటినుండి అంతా ఊహించిన విధంగానే పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని భావించి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈరోజు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేశారు. 
 
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 5,34,903 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడులను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల విషయంలో భవిష్యత్తు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 
 
మరి తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులు అదృష్టవంతులా...? దురదృష్టవంతులా...? అనే ప్రశ్నకు సమాధానంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్నల్ మార్కుల విషయంలో కరెక్ట్ గానే వ్యవహరించినా, కార్పొరేట్... ప్రైవేట్ పాఠశాలలు మార్కుల్లో అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. 
 
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెజారిటీ శాతం విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నా కొందరు విద్యార్థులు మాత్రం పరీక్షలు నిర్వహించి ఉంటే బాగుండేదనే అభిప్రాయపడుతున్నారు. ప్రతిభకు కొలమానమైన పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వం ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడ్లు కేటాయిస్తామని చెప్పడంతో ఆ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కంగారు పడుతున్నారు. మరి పదో తరగతి విద్యార్థులు అదృష్టవంతులో దురదృష్టవంతులో చెప్పాలంటే కొంత కాలం ఆగాల్సిందే.                           

మరింత సమాచారం తెలుసుకోండి: