ఏదైనా ఒక ప్రాజెక్టు వచ్చిందంటే.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. అందుకే ఏదైనా పరిశ్రమ వస్తుందంటే అక్కడ ఉండే భూములకూ విలువ పెరుగుతుంది. అన్ని విధాలా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఇప్పుడు జగన్ సర్కారు ప్రకాశం జిల్లాపై అలాంటి వరాలు వర్షం కురిపించింది.

 

 

ప్రకాశం జిల్లాలో రెండు విద్యుత్ ప్రాజెక్టులు పెట్టాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ప్రకాశం జిల్లా కనిగిరి, దర్శిలలో 2 వేల మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిందట. ఈ విషయాన్ని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే మార్కాపురం మెడికల్‌ కాలేజీ, రామాయపట్నం పోర్టు, నిమ్స్‌ వంటి భారీ ప్రాజెక్టులు త్వరలో అమలు చేయబోతున్నామని ప్రకటించారు.

 

 

ఈ ప్రాజెక్టులు సాకారమైతే ప్రకాశం జిల్లాలో వెలుగులు విరజిమ్మడం ఖాయం. ప్రకాశం జిల్లా వైసీపీకి ఆరంభం నుంచి మంచి పట్టున్న జిల్లాగానే ఉంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ వైసీపీకి మంచి సీట్లే వచ్చాయి. చంద్రబాబు తన పాలనలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాడని.. అందుకే తాము ఆ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి బాలినేని అంటున్నారు.

 

 

రైతుల సంక్షేమం కోసం ఏం చేయడానికైనా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం చొరవతో రైతులకు ఉచితంగా పగటిపూటనే 9 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. రైతుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఫ్యాక్టరీల పరిస్థితిపై కమిటీలు వేశామని, కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి. ఒంగోలు భగీరథపై కూడా కమిటీ విచారణ చేస్తోందన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: