దేవినేని అవినాష్...విజయవాడ రాజకీయాలపై మంచి పట్టున్న నాయకుడు. తండ్రి దేవినేని నెహ్రూ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీలో యూత్ నాయకుడుగా పని చేసి, ఆ తర్వాత తండ్రితో పాటు టీడీపీలోకి వచ్చి, మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. తండ్రి చనిపోయినా సరే, టీడీపీ కోసం కష్టపడి పనిచేశారు. అధినేత మాటకు కట్టుబడి ఓడిపోతానని తెలిసిన కూడా గుడివాడలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి వచ్చినా క్రుంగిపోకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ...పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

 

అయితే ఇలా మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో కొందరు సీనియర్ నేతలు అవినాష్‌పై నెగిటివ్ ప్రచారం చేశారు. దీన్ని పార్టీ అధినాయకత్వం కూడా పట్టించుకోకపోవడంతో అవినాష్ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక వైసీపీలోకి రాగానే జగన్, అవినాష్‌కు విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పగించేశారు. ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో, అప్పటి నుంచి తూర్పు ప్రజల కోసం కష్టపడుతున్నారు.

 

అక్కడి ప్రజలకు ఎలాంటి కష్టమున్నా సరే సొంత డబ్బులని సైతం ఖర్చు పెడుతూ ముందుకెళుతున్నారు. ఇటీవలైతే లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడ్డ ప్రజలకు అన్నివిధాలుగా అండగా నిలిచారు. అలాగే ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్స్ అందేలా చేస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అంటే అవినాష్‌కు ఎమ్మెల్యే పదవి ఒక్కటే తక్కువ ఉందిగానీ, అంతకంటే ఎక్కువగానే ప్రజలకు మేలు చేస్తున్నారు.

 

ఇదే సమయంలో తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా...తనకు సాధ్యమైన మేర ప్రజలకు మేలు చేస్తున్నారు. ఎంపీ కేశినేని నాని నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తూర్పులో గద్దె బలం ఏమి తగ్గలేదు. మరి ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్న అవినాష్...వచ్చే ఎన్నికల్లో గద్దెకు ఎంతవరకు చెక్ పెడతారు? అంటే చెప్పలేని పరిస్తితి నెలకొంది. తూర్పులో గద్దెతో కష్టమే అని అర్ధమవుతుంది. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లోనైనా ఎమ్మెల్యే అవ్వాలనే అవినాష్ కోరిక నెరవేరతుందో? లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: