ఏపీ రాజకీయాలకు విజయవాడ సెంటర్ అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఎలాంటి విషయమైన పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. అలాగే విజయవాడలో గెలిస్తే రాజకీయ పార్టీలకు అదొక కిక్. ప్రధానంగా విజయవాడ ఎంపీ సీటుని గెలుచుకోవడానికి ప్రధాన పార్టీలు తీవ్ర పోటీ పడతాయి. ఈ ఎంపీ సీటుని ఎక్కువసార్లు కాంగ్రెస్ కైవసం చేసుకోగా, తర్వాత టీడీపీ వచ్చాక ఎక్కువసార్లు విజయం సాధించింది.

 

అయితే వైసీపీ ఇంతవరకు ఇక్కడ బోణి కొట్టలేదు. 2014 ఎన్నికల ద్వారా తొలిసారి రంగంలోకి దిగిన వైసీపీ, విజయవాడ ఎంపీ సీటులో ఓటమి పాలైంది. టీడీపీ నుంచి పోటీ చేసిన కేశినేని నాని, వైసీపీ అభ్యర్ధి కోనేరు రాజేంద్ర ప్రసాద్‌పై విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టడం సాధ్యపడకపోవడంతో, 2019 ఎన్నికల్లో జగన్ వ్యూహం మార్చి, కేశినేనిపై ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్(పి‌వి‌పి)ని నిలబెట్టారు.

 

ఇక రాష్ట్రమంతా టీడీపీపై వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఈసారి విజయం వైసీపీదే అని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ బలం, కేశినేని పనితీరు ముందు పి‌వి‌పి ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లోనైనా టీడీపీని దెబ్బకొట్టడానికి జగన్ ఈసారి కూడా వ్యూహం ఏమైనా మారుస్తారా? అనే చర్చ విజయవాడ వైసీపీ వర్గాల్లో నడుస్తోంది. ప్రస్తుతానికి పి‌వి‌పి ఉన్నాసరే, ఆయన అంత యాక్టివ్‌గా ఉంటున్నట్లు కనిపించడం లేదు.

 

అదే సమయంలో కేశినేని నిత్యం విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏదొక పనిచేస్తూనే ఉంటున్నారు. ఆయన కుమార్తె శ్వేత విజయవాడ కార్పొరేషన్ చైర్‌పర్సన్ అభ్యర్ధి కావడంతో, ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కేశినేనికి పి‌వి‌పి ద్వారా చెక్ పెట్టడం సాధ్యమవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి.

 

ఒకవేళ పి‌వి‌పి కాకపోతే విజయవాడ మీద పట్టున్న దాసరి జై రమేష్‌ని రంగంలోకి దించేతే బెటర్ అనే అభిప్రాయం వైసీపీ కేడర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే విజయవాడ పార్లమెంట్ సీటు విషయంలో జగన్ మనసులో ఏముందో అనేది తెలియడం లేదు. ఒకవేళ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌ని మార్చాలనుకుంటే ఇప్పుడే మారిస్తే బెటర్ అని, ఎన్నికల సమయంలో సడన్‌గా అభ్యర్ధిని ప్రకటించడం కంటే ఇప్పుడే సరైన నాయకుడుని పెట్టేస్తే మంచిదని వైసీపీ కేడర్ యోచనగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: