దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. రెండు రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య పది వేలకు చేరువగా ఉంది. ప్రపంచ కరోనా కేసుల్లో భారత్ ఐదో స్థానంలో ఉండగా.. మరణాల్లో 12వ స్థానంలో కొనసాగుతోంది.

 

భారత్‌లో కరోనా వైరస్‌ విస్తరణ నానాటికీ తీవ్రమవుతోంది. దేశంలో రోజురోజుకు రికార్డుస్థాయిలో రోగుల సంఖ్య పెరిగిపోతోంది. గడచిన ఐదు రోజులుగా నిత్యం 9వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  ఒక్కరోజే అత్యధికంగా 9 వేల 983 మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. భారత్‌లో 24గంటల్లో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో సోమవారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 2 లక్షల 56 వేల 611కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. 

 

దేశంలో కరోనా మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడచిన 24గంటల్లో 206మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్‌ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7 వేల 135కి చేరింది. భారత్‌లో కరోనా బారినపడిన వారిలో ఇప్పటివరకు లక్ష 24 వేల 94 మంది కోలుకోగా.. మరో లక్ష 25 వేల 381 మంది చికిత్స పొందుతున్నారు.

 

తమిళనాడు, జమ్ముకశ్మీర్, పశ్చిమబెంగాల్ లో రోజువారీ కేసుల్లో కొత్త రికార్డు నమోదైంది. తమిళనాడులో ఒక్కరోజే 15 వందల 15 మందికి కరోనా రాగా.. మొత్తం కేసుల సంఖ్య 31 వేల 667కి చేరింది. గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలో ఒక్కరోజే 21 మంది చనిపోయారు. దీంతో అహ్మదాబాద్ జిల్లాలోనే మొత్తం కేసుల సంఖ్య వెయ్యి 15కి చేరింది. దేశంలో ముంబై తర్వాత వెయ్యి కేసులు దాటిన జిల్లాగా అహ్మదాబాద్ రికార్డులకెక్కింది. గుజరాత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది. దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. 

 

కొవిడ్‌-19 కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, రష్యా, యూకే తొలి నాలుగు స్థానంలో ఉండగా.. భారత్‌ 5 స్థానంలో కొనసాగుతోంది. దాదాపు 2లక్షల 87వేల కేసులతో బ్రిటన్‌ నాలుగో స్థానంలో ఉండగా.. 2లక్షల 41వేల కేసులతో స్పెయిన్‌ ఆరో స్థానంలో ఉన్నాయి. కరోనా మరణాల్లో మాత్రం భారత్‌ ప్రపంచంలో 12స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం కెనడా 7 వేల 700 మరణాలతో 11స్థానంలో ఉండగా.. 6 వేల 13 మరణాలతో నెదర్లాండ్‌ 13స్థానంలో కొనసాగుతోంది.

 

దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30న నమోదు కాగా.. 10 వేల కేసులు రావడానికి 74 రోజుల సమయం పట్టింది. కానీ గత ఐదు రోజుల్లోనే 50 వేల కొత్త కేసులు రావడం వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: