ఓవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఆ కారణంగా ఆర్టీసీ బస్సులు చాలా వరకూ డిపోలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు కాస్త వెసులుబాటు ఇచ్చినా.. ఏసీ బస్సులు నడపడం లేదు. చల్లని వాతావరణంలో కరోనా విజృంభిస్తుందన్న కారణంతో ఏసీ బస్సు సర్వీసులను పక్కకు పెట్టేశారు. అయితే ఇప్పుడు ఏపీ సర్కారు ఓ మంచి ఐడియాతో ముందుకొస్తోంది.

 

 

ఆర్టీసీ లోని ఎసీ బస్సులను కోవిడ్ పరీక్షల బస్సులుగా మారుస్తున్నారు. ఆర్టీసీ ఏసీ బస్సులను కరోనా పరీక్షలు చేసేందుకు వీలుగా తాత్కాలికంగా వినియోగించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ వినతి మేరకు ఆర్టీసీ ఏసీ బస్సులను మొబైల్ మెడికల్ క్లినిక్ వ్యానులుగా మార్చేస్తోంది. ముందుగా ప్రయోగాత్మకంగా విజయవాడ డిపోకు చెందిన ఒక ఎసీ బస్సును కోవిడ్ పరీక్షల బస్సు గా అధికారులు మార్చారు.

 

 

ఆర్టీసీ బస్సుతో కరోనా పరీక్షలు ఏంటంటారా.. కరోనా పరీక్షల నమూనా సేకరించడం ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత పరీక్షలు చేయడం కూడా కష్టసాధ్యం అవుతోంది. అందుకే ఏసీ బస్సుల్లోపలి ప్రాంతాన్ని నమూనాలు సేకరించేందుకు, పరీక్షలు నిర్వహించేందుకు అనుపుగా మార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి మొబైల్ టెస్టింగ్ సెంటర్లన్నమాట.

 

 

ఆర్టీసీ హౌస్ ను సందర్శించిన రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అధికారులు రూపొందించిన బస్సును పరిశీలించారు. ఆర్టీసీ ఎండీ మాది రెడ్డి ప్రతాప్ సహా అధికారులకు పలు సూచనలు చేశారు. మార్పు చేసిన బస్సును కరోనా ప్రభావిత ప్రాంతాలకు తీసుకెళ్తారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అక్కడే ఈ బస్సులో కరోనా పరీక్షలు చేసేస్తారు. ఐడియా చాలా బావుంది కదూ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: