ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇంతకీ ఈ లేఖ దేని కోసం అంటారా.. ఇటీవల జగన్ సర్కారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలని నిర్ణయించింది. ఇందుకు జీవో కూడా విడుదల చేసింది. అయితే ఈ విషయంపై ఆయన తెలంగాణ సర్కారుతో సంప్రదించలేదు. ఉమ్మడి హక్కు ఉన్న నదిపై ప్రాజెక్టు విషయంలో తమను సంప్రదించకుండా ఎలా జీవో విడుదల చేస్తారంటోంది తెలంగాణ సర్కారు.

 

 

ఇదే సమయంలో పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కూడా అంగీకరించ లేదు. పైగా దీనిపై స్టే ఇచ్చింది. ఏపీ సర్కారు రాయలసీమలోని కరువు ప్రాంతాలకు నీళ్లివ్వాలని ఈ ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతోంది. అయితే అది కేంద్రానికి అర్థం కావడం లేదన్నది జగన్ భావన. ఇటీవల కృష్ట్యా ట్రైబ్యునల్ సమావేశంలోనూ ఇదే అంశంపై ఏపీ తన వాదన వినిపించింది.

 

 

అందుకే ఇప్పుడు కేంద్రానికి కూడా తమ వాయిస్ వినిపించాలని జగన్ భావిస్తున్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయమై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు లేఖ రాయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఏపీకి ఉన్న కేటాయింపుల పరిధిలోనే తాగునీటి సమస్య పరిష్కారానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నట్లు కేంద్రానికి అర్థమయ్యేలా లేఖ ఉండాలని సీఎం జగన్ సూచించారు.

 

 

ఇటీవల జరిగిన కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలను ఏపీ జల వనరుల శాఖ అధికారులు వివరించిన సమయంలో సీఎం జగన్ ఈ మేరకు సూచించారు. ఓవైపు ఆలమట్టి జలాశయం ఎత్తు పెంపు ద్వారా ఇప్పటికే దిగువకు నీళ్లు రాని పరిస్థితి ఉందన్న జగన్ సీమ జిల్లాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన స్టే తొలగింపునకు ప్రయత్నాలు చేసి రాయలసీమ ఎత్తిపోతల టెండర్లపై ముందుకు వెళ్లాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: