చిర‌కాల శ‌త్రువులుగా వ‌ర్ధిల్లుతున్న ద‌క్షిణ కొరియా..ఉత్త‌ర కొరియా దేశాల మ‌ధ్య వివాదం రెట్టింప‌వుతోంది. దక్షిణ కొరియాతో సైనిక, రాజకీయ పరమైన అన్ని సంబంధాలను తెంచుకుంటామని ఉత్తర కొరియా మంగళవారం ప్ర‌క‌టించింది. తమ శత్రుదేశంతో ఇక ఎంతమాత్రం సంబంధాలు  కొన‌సాగించ‌బోమ‌ని ఉత్త‌ర కొరియా అధికారిక  మీడియా వెల్ల‌డించింది. ఇరు ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా సరిహద్దుల్లో కరపత్రాలు పంచుతున్న కార్యకర్తలపై బెదిరింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన వారు.. కిమ్‌ నియంతృత్వ పోకడలు, అణ్వాయుధాల త‌యారీపై  సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. 


అంతేకాకుండా కిమ్ ఉత్త‌ర కొరియాలో చేప‌డుతున్న విధానాల‌ను ఎండ‌గ‌డుతూ క‌ర‌ప‌త్రాల‌ను ముద్రించి  గాల్లోకి విసిరారు. ఈ సంఘ‌ట‌న‌ల‌ను, నిర‌స‌న‌ల‌ను తీవ్రంగా తీసుకున్న కిమ్ ప్ర‌భుత్వం ద‌క్షిణ కొరియాతో ఎంత‌మాత్రం విదేశీ సంబంధాల‌ను కొన‌సాగించ‌లేమ‌ని తేల్చి చెప్పింది. ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకుంటున్న‌ట్లు వారం రోజుల క్రితమే ఉత్త‌ర కొరియా ప్ర‌క‌టించ‌గా తాజాగా మ‌రికొన్ని ప్ర‌క‌ట‌న‌లు ఇరు దేశాల మ‌ధ్య అంత‌రాన్ని పెంచేశాయ‌నే చెప్పాలి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌-జే-ఇన్‌ మధ్య 2018లో మూడు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 


దాయాది దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొల‌గిపోలేదు. 1910లో కొరియాను జపాన్ విలీనం చేసుకుంది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో జపాన్ లొంగిపోయిన తరువాత యునైటెడ్ స్టేట్స్ , సోవియట్ యూనియన్ కొరియాను రెండుగా విభజించబడింది. కొరియా తిరిగి సైఖ్యపరచాలని చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 1948లో రెండు ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి.  ఉత్తర భాగంలో ది డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణ ప్రాంతంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా ఏర్ప‌డ్డాయి.  డి.పి.ఆర్.కె అధికారికంగా తనకు తాను " సెల్ఫ్ - రిలయంట్ సోషలిస్ట్ స్టేట్ " వర్ణిస్తుంది. విమర్శకులు ఉత్తర కొరియాను నిరంకుశ ప్రభుత్వంగా భావిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: