అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు రాజ్యసభ ఎన్నికలు అగ్ని పరీక్షలా తయారయ్యాయి.  సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. మధ్యప్రదేశ్‌లో ఆధిపత్య పోరుతో ఏకంగా ప్రభుత్వాన్నే కోల్పోయిన హస్తం పార్టీ... గుజరాత్‌లో ఉన్న ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రయత్నిస్తోంది. రాజ్యసభ ఎన్నికల ముందు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్‌.

 

 రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లో ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనే 8 మంది పార్టీ వీడి బయటకు వెళ్లిపోయారు. అసలే ముందు రాజ్యసభ ఎన్నికలు. దీంతో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది అధిష్టానం. ఎమ్మెల్యేలను పక్కనే ఉన్న రాజస్థాన్‌కు తరలిస్తోంది. వీరి కోసం కొటాలో క్యాంపును ఏర్పాటు చేసింది.

 

గుజరాత్‌లో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. కాంగ్రెస్‌, బీజేపీకి ఉన్న బలాబలాలతో చెరు రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. 19న ఎన్నిక  నిర్వహించనున్నారు. ఐతే బీజేపీ మాత్రం మూడు స్థానాలపై కన్నేసింది. ఇందుకోసం పక్కా ప్లాన్ వేసింది. అచ్చం అహ్మద్ పటేల్‌ రాజ్యసభ ఎన్నికైన సయంలో జరిగిన హైడ్రామానే మళ్లీ రిపీట్‌ అవుతున్నట్లు కన్పిస్తుంది. కాంగ్రెస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంది బీజేపీ. 

 

ఎవరైనా అభ్యర్థి గెలవాలంటే 37 మొదటి ప్రధాన్యత ఓటు లభించాలి. అంటే రెండుస్థానాలు గెలుచుకోవాలంటే ఈ బలం సరిపోదు. ఇటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని కాంగ్రెస్‌కు మద్ధతు ఇచ్చినా... నో యూజ్‌. దీంతో బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నిస్తోందని పసిగట్టిన కాంగ్రెస్‌...20 మందిని రాజస్థాన్‌కు పంపింది.

 

మొత్తం మీద రాజ్యసభ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకున్నట్లు కన్పిస్తోంది. బీజేపీకి మూడు స్థానాలు దగ్గకుండా, తమ ఎమ్మెల్యేలు చేజారకుండా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది హస్తం పార్టీ.

మరింత సమాచారం తెలుసుకోండి: