ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా డిప్రెషన్ లో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. ఒకవైపు వయసు, మరోవైపు పార్టీ పరిస్థితి భవిష్యత్తు తెలియక సతమతమవుతున్నారు. అధికార పార్టీ వైసీపీ రోజురోజుకు ప్రజల్లో బలం పెంచుకుంటూ ముందుకు వెళుతుండటం, తెలుగుదేశం బలహీన అవుతుండటం, పార్టీలో కీలక నాయకులు ఒక్కొక్కరుగా అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నా వలసలు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండకపోవడం, మరికొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దఎత్తున వైసీపీలో చేరేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారనే వార్తలు, మరికొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి రావడం ఇలా అన్ని విషయాలు చంద్రబాబు టెన్షన్ పెడుతున్నాయి.

IHG


 ఇదిలా ఉంటే తన రాజకీయ వారసుడు లోకేష్ భవిష్యత్ పైన చంద్రబాబు బెంగ పట్టుకుంది. తాను పార్టీలో యాక్టివ్ గా ఉన్న సమయంలోనే ఆయనకు ఏదో ఒక కీలక పదవి అప్పగించాలని చూస్తున్నారు. పనిలో పనిగా ఏపీ టీడీపీ అధ్యక్షుడి పదవిని కూడా భర్తీ చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ వ్యవహారంపై స్పందించారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని, ఆయన చెప్పుకొచ్చారు. అసలు లోకేష్ కారణంగానే తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆయన నాయకత్వంలో నడుస్తామని విశాఖ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే తో అయినా చెప్పించగలరా అంటూ మంత్రి అవంతి సవాల్ విసిరారు. 

 


లోకేష్ వెనుక భజన బ్యాచ్ ఎక్కువగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్నా, ఆ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది ఆ పార్టీ నాయకులంతా గుర్తుంచుకోవాలని, దీనంతటికీ కారణం లోకేష్ అంటూ అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు నియామకానికి సంబంధించి చంద్రబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడిగా కింజారపు అచ్చెన్నాయుడు , చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు ను పరిగణలోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ లోకేష్ పేరును ప్రస్తావించడం, ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందంటూ పేర్కొనడం చూస్తుంటే చంద్రబాబు ఈ రకమైన ఆలోచన కూడా చేసి ఉండవచ్చనే అనుమానాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొంది. ఒకవేళ అదే జరిగితే పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే సందేహం కూడా వారిలో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: