కరోనా అందరినీ కబళిస్తోంది. దానికి ఎలాంటి బేధాలు లేవు. అందుకే నిత్యం జనంలో తిరిగే జర్నలిస్టులూ ఈ రిస్కు ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో జర్నలిస్టులకు కరోనా సోకుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఇటీవలే టీవీ5 రిపోర్టర్ మనోజ్ కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇటీవలే వివాహమైన అతని భార్య గర్భవతి కూడా. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరన్న ప్రశ్న తోటి జర్నలిస్టులను వేధిస్తోంది.

 

 

అటు మిగిలిన మీడియా హౌజుల్లోనూ కరోనా జాడలు కనిపిస్తున్నాయి. టీవీ9లోనూ ఒకరికి కరోనా వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అసలే తెలుగు మీడియాలో కరోనా కారణంగా జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. కానీ ఉద్యోగం కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సివస్తోంది.

ఏందిరా భాయ్ ఈ దారుణం... జీతం సరిగా ఇవ్వని మీడియా కోసం జీవితం ఇచ్చేశావా....
అంటూ జర్నలిస్టు మిత్రులు ఆవేదన చెందుతున్నారు.

 


న్యూస్ కవరేజ్ కోసం వెళితే దారిలో ప్రమాదం జరిగినా పనిచేసే సంస్ధలు పైసా ఇవ్వరని తెలుసు... పైగా జాగ్రత్తగా ఉండక్కర్లేదా అని జాలి చూపించి ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొనే మేనేజ్మెంట్లు ఉన్నాయని తెలుసు..రేపు లీవ్ తీసుకుని ఎల్లుండి వచ్చేయ్ అనే హృదయంలేని ఇన్చార్జులు... ఉన్నారని తెలుసు.. అన్నం తినే సమయంలో పక్క ఛానల్ లో బ్రేకింగ్ పడుతుంటే చేతులు కడుక్కొని పరిగెత్తాలని తెలుసు... అంటూ జర్నలిస్టుల జీవితాల్లోని కష్టాలు గుర్తు చేసుకుంటున్నారు.

 

 

అర్దరాత్రి గాఢ నిద్రలో ఫోన్ రింగ్ అయితే పరిగెత్తాలని తెలుసు... 24 గం.లు ఫోన్ & వాట్సప్ ఆన్ లో ఉండాలని తెలుసు.. మిగిలిన బీట్లు లాగ కాకుండా 24 గం.లు డ్యూటి చేయాలని తెలుసు.. శవాలతో సావాసం, పోలీసులతో పరుగులు ఉంటాయని తెలుసు.. కుటుంబంతో ఒక పూట కూడా గడిపే అవకాశం ఉండదని తెలుసు.. మూడు పూటల టైమ్ ప్రకారం తినడం అంటే అద్బుతం అని తెలుసు... టైమ్ కి తినక ఆరోగ్యం పాడైపోతుందని తెలుసు.. ఇన్ని తెలిసి కూడా ధైర్యంగా పనిచేస్తున్నాడంటే అదీ రిపోర్టర్ అంటే అని జర్నలిస్టులు మనోజ్ గురించి గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: