రాకాసి వైరస్ విజృంభణ భారత్‌లో కొనసాగుతూనే ఉంది. ఏ రోజుకారోజూ అత్యధిక కేసులు నమోదవుతూ ఆందోళనకర స్థాయికి చేరుతోంది. ఇండియాలో గత 24 గంటల్లో 9,987 కేసుల నమోదు ఓ రికార్డు కాగా.. 331 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు ప్రపంచ కరోనా లిస్టులో ఇండియా ఐదో స్థానంలో ఉంది...!  

 

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. గతవారం రోజులుగా దేశంలో నిత్యం 9వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గడచిన 24గంటల్లోనే అత్యధికంగా 9,987 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్‌ ప్రవేశించిన అనంతరం ఒకేరోజు అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో కొవిడ్‌-19 మహమ్మారికి బలి అవుతున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331మంది మృత్యువాతపడ్డారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. 

 

మంగళవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 2లక్షల 66వేల 598కి చేరిందని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ. వీరిలో ఇప్పటివరకు 7వేల 466 మంది కరోనాతో మరణించారు. మొత్తం బాధితుల్లో లక్ష 29 వేల 215 మంది కోలుకోగా మరో లక్ష 29వేల 917 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. 'వరల్డోమీటర్‌' వివరాల ప్రకారం... విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్య పరంగా అమెరికా తొలి స్థానంలో ఉండగా... 8వేల 944 కేసులున్న భారత్‌దే ద్వితీయ స్థానం. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న బ్రెజిల్‌లో కేసులు భారత్‌ కంటే మూడురెట్లు అధికమైనప్పటికీ.. సీరియస్‌ కేసులు మన కంటే తక్కువగా ఉన్నాయి. ఇక రష్యాలో సీరియస్‌ కేసుల సంఖ్య భారత్‌లో నాలుగో వంతుగా ఉంది.

 

దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య మన దేశంలో ఐదు శాతం కంటే తక్కువేనని ప్రకటించింది కేంద్రం. ఇక ఐసీయూలో ఉన్న బాధితులు 2.25 శాతం కాగా.. 1.91 శాతం మందికి ఆక్సిజన్‌ సహాయం అందిస్తున్నామని తెలిపింది. కరోనా కేసుల్లో అధిక భాగం మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచే ఉన్నాయని వివరించింది ఆరోగ్యశాఖ. కరోనా వ్యాప్తి కట్టడిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా అధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 15 రాష్ట్రాల్లోని 50కి పైగా జిల్లాలు, పురపాలక సంఘాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది కేంద్రం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: