క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో తిరిగి లాక్‌డౌన్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా లేని కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయంగా అన‌వ‌స‌రంగా బ‌య‌టకు రాకుండా నిరోధించే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని యోచిస్తోంది. ముందుగా కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న ఉద్యోగుల నుంచే ఈ మార్పున‌కు శ్రీకారం చుట్టేందుకు సిద్ధ‌ప‌డింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్‌ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మళ్లీ వర్క్‌ ఫ్రం హోం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.


కంటోన్మెంట్ ప‌రిధుల్లో ఉన్న ఉద్యోగుల‌కు ఇప్ప‌టికే విధుల నుంచి మిన‌హాయింపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. కొంత‌మంది ఉద్యోగులు అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ విధుల‌కు హాజ‌ర‌వుతున్న నేప‌థ్యంలో మిగ‌తా వారికి క‌రోనా బెడ‌ద మ‌దిలో మెదులుతోంది. దీంతో ప‌నిచేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఆత్మ‌నూన్య‌త భావంతో ప‌నిచేయాల్సి రావ‌డం కూడా బాధితుల‌ను మ‌నో వ్య‌ధ‌కు గురి చేస్తోంద‌ని ఉన్న‌తాధికారుల‌కు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కేంద్ర‌ప్ర‌భుత్వం పూర్తి ఆరోగ్యంతో ఉన్న‌వారిని మాత్ర‌మే విధుల‌కు హాజ‌రయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది.


పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతినిస్తున్నట్టు, మిగతావారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉన్న ఉద్యోగులు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ  ఆఫీసులకు రావద్దని మార్గదర్శకాల్లో  సూచించింది. ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని నిబంధ‌న‌ల్లో పేర్కొంది. ఇక సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలని వెల్లడించింది. తమను తాము కాపాడుకొని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్యోగులంతా తాజా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్రం చెప్పింది.ఇదిలా ఉండ‌గా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు ఉధృతమవుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో 9,987 కేసులు నమోదుకాగా, మహమ్మారి బారినపడి 331 మంది చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: