వలస కూలీలను పదిహేను రోజుల్లో స్వస్థలాలకు చేర్చాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వారిపై లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు ఉపసంహరించుకోవాలని అన్ని రాష్ట్రాలకూ సూచించింది. రాష్ట్రాలు కోరిన 24 గంటల్లో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వలస కూలీలపై సుమోటోగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తర్వాతి విచారణను జులై 8కి వాయిదా వేసింది. 

 

స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీలను గుర్తించి 15 రోజుల్లో తరలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో శ్రామిక్‌ రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వలస కూలీలపై నమోదు చేసిన లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులు ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

 

స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి, వారికి ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారో వివరిస్తూ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనికి సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై 8కి వాయిదా వేసింది. 

 

లాక్‌డౌన్‌ విధించిన తర్వాత వలస కూలీలు కాలినడకన స్వస్థలాలకు బయలుదేరిన ఘటనలు చూసిన సర్వోన్నత న్యాయస్థానం వలస కూలీల అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. వలస కూలీల తరలింపుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయొద్దని ఇప్పటికే ప్రభుత్వాలకు సూచించింది సుప్రీంకోర్టు. వలస కూలీల నైపుణ్యాలను గుర్తించి.. వారికి ఎలా ఉపాధి కల్పిస్తారో అఫిడవిట్లు దాఖలు చేయాలని అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది సుప్రీంకోర్టు. స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీల వివరాలు, లాక్ డౌన్ కు ముందు వారు చేసిన పని వివరాలు కూడా కోర్టు ముందుంచాలని చెప్పింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ షా తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

 

అయితే ఇప్పటివరకు కోటి మంది వలస కూలీలు స్వస్థలాలకు చేరుకున్నారని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. శ్రామిక్ రైళ్ల ద్వారా 57 లక్షల మంది, ఇతర మార్గాల ద్వారా 41 లక్షల మంది వెళ్లారని చెప్పారు. మళ్లీ తమ పని ప్రదేశాలకు వెళ్లాలనుకునే వలస కూలీలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచించింది. అటు ఉపాధి హామీ పథకాన్ని వలస కూలీలను అనువుగా మలచాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటికే కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: