భారత్, చైనా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ మొదలైంది. సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించిన ఇరు పక్షాలు.. సైన్యాన్ని వెనక్కి రప్పిస్తున్నాయి. చైనా సైన్యం రెండున్నర కిలోమీటర్లు వెనక్కి వెళ్లగా.. భారత్ సైన్యం కూడా కొంత మేర వెనక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్యాంగాంగ్ సరస్సు దగ్గర మాత్రం ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. 

 

లడఖ్ లో భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన సడలుతోంది. గాల్వన్ లోయ సహా మరో మూడు ప్రాంతాల నుంచి రెండు దేశాల సైన్యాలు కొంత మేర వెనక్కితగ్గాయి. 2017 డోక్లాం ప్రతిష్ఠంభన తర్వాత గత నెల రోజులుగా లడఖ్ లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ప్యాంగాంగ్ సరస్సు దగ్గర ఇరు దేశాల సైనికుల మధ్య స్వల్ప ఘర్షణతో మొదలైన ప్రతిష్ఠంభన.. గాల్వన్ లోయ, దెమ్ చోక్ లాంటి మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. 

 

ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యకు పరిష్కారం కోసం మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగినా ఫలితం కనిపించకపోవడంతో.. గత శనివారం లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల తర్వాత సానుకూల పరిణామాలు కనిపించాయి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని రెండు దేశాలూ వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశాయి. మరోసారి ఈ వారంలో బెటాలియన్ కమాండర్ స్థాయి చర్చలు జరగాల్సిన తరుణంలో.. చైనా సైన్యం రెండున్నర కిలోమీటర్లు వెనక్కి వెళ్లగా.. భారత్ సైన్యం కూడా కొంత మేర వెనక్కి వచ్చింది. దీంతో చర్చల ముందు సుహృద్భావ వాతావరణం ఏర్పడినట్టేనని భావిస్తున్నారు. 

 

అయితే సమస్యకు ప్రధాన కారణమైన ప్యాంగాంగ్ సరస్సు దగ్గర ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఇక్కడి ఫింగర్ పాయింట్స్ విషయంలో అస్పష్టమైన సరిహద్దులు ఉండటం వివాదానికి కారణమైంది. ప్యాంగాంగ్ సరస్సులో గస్తీ కాస్తున్న భారత్ జవాన్లను చైనా సైనికులు అడ్డుకోవడంతో పాటు.. ఆటవిక గుంపులా వ్యవహరించి గాయపర్చడం.. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో భారత్ కూడా మరిన్ని బలగాలను ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతానికి తరలించింది. ఈసారి చర్చలు ప్రధానంగా ప్యాంగాంగ్ సరస్సు చుట్టూ తిరుగుతాయని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: