అనీల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఒకే తండ్రి బిడ్డలు. ఒకే తండ్రి బిడ్డలైనా వీరిలో ఒకరు సక్సెస్ కు ఉదాహరణగా నిలుస్తుంటే మరొకరు ఫెయిల్యూర్ కు ఉదాహరణగా నిలుస్తున్నారు. ఒక తండ్రి బిడ్డలు ఒకేలా ఉండరని చెప్పటానికి వీరిద్దరే సాక్ష్యం. ముఖేష్ అంబానీ రోజురోజుకు ఎదుగుతోంటే అనీల్ అంబానీ అంతకంతకూ పతనం దిశగా అడుగులేస్తున్నాడు. ఇద్దరికీ తండ్రి ఆస్తులు సమానంగా రాగా ముఖేష్ ఆస్తులను పెంచుకుంటే అనీల్ మాత్రం ఆస్తులను కోల్పోతున్నారు. 
 
ప్రస్తుతం అనీల్ అంబానీ ఐపీ స్వయంగా ప్రకటించుకునే దుర్భరమైన స్థితికి వెళ్లారు. విదేశాలకు చెల్లించాల్సిన నగదు కోసం అన్నపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖేష్ అంబానీ జియోలోకి మాత్రం పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇద్దరిలో ఒకరు సక్సెస్ కావడానికి మరొకరు ఫెయిల్యూర్ కావడానికి కారణాలేమిటి అనే ప్రశ్నకు విశ్లేషకులు ఆసక్తికరమైన విషయాలను సమాధానంగా చెబుతున్నారు. 
 
ధీరూబాయ్ అంబానీ ఉన్న సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి గ్యాస్ చాలా తక్కువ ధరకే రిలయన్స్ పవర్ కు సరఫరా అయ్యేది. అన్నాదమ్ములు విడిపోయాక ముఖేష్ చేతికి రిలయన్స్ ఇండస్ట్రీస్... అనీల్ చేతికి రిలయన్స్ పవర్ వచ్చాయి. దీంతో అనీల్ అధిక ధర పెట్టి గ్యాస్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్ ధరకు గ్యాస్ కొనుగోలు చేయాల్సి రావడంతో అక్కడినుంచే పతనం మొదలైందని విశ్లేషకులు చెబుతున్నారు. 
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వచ్చిన లాభాలను ముఖేష్ తెలివిగా ఖర్చు పెట్టగా అనీల్ అంబానీ మాత్రం సినిమాల్లో పెట్టుబడులు పెట్టి అప్పుల్లో మునిగిపోయారు. ముఖేష్ పరిస్థితులకు అనుగుణంగా జియోను ప్రవేశపెడితే అనీల్ ఉన్నవి కూడా అమ్ముకునే పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండటం ముఖేష్ కు ప్లస్ అయిందని అనీల్ అంబానీ లౌక్యం తెలియక దెబ్బ తిన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు విదేశీ అప్పుల విషయంలో అనీల్ ను ముఖేష్ ఆదుకుంటాడో లేదో కూడా చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: