దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ 10,000కు అటూఇటుగా ప్రమాదకర స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిన్నటివరకు దేశవ్యాప్తంగా 2.6 లక్షల కేసులు నమోదైనట్టు కీలక ప్రకటన చేసింది. కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్రం అన్ లాక్ 1.0 లో భాగంగా ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు అనుమతులు ఇచ్చింది. 
 
అన్ లాక్ 1.0 లో ఇచ్చిన సడలింపుల వల్ల కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,66,598 కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా దేశంలో సగటున 250 మంది వరకు మరణిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 7.466 మంది కరోనా నుంచి కోలుకోలేక మృతి చెందారు. త్రిపుర, ఛత్తీస్ గఢ్, అస్సాం, కర్ణాటక, జమ్మూకశ్మీర్, హరియాణా రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. 
 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 48.47 శాతం రికవరీ రేటుగా ఉన్నట్టు వెల్లడించింది. మరోవైపు కరోనా లక్షణాల వల్ల స్వీయ నిర్భంధంలో ఉన్న కేజ్రీవాల్ కు నిన్న కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. మరోవైపు ఢిల్లీలో వచ్చే నెల 31వ తేదీ నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 30 నాటికి లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
మరోవైపు ప్రజలు చేస్తున్న చిన్నచిన్న తప్పులే వైరస్ విజృంభణకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేస్తున్నా చాలా చోట్ల ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో జనం గుంపులుగుంపులుగా గుమికూడుతున్నారు. ప్రజల్లో కొందరు నిర్లక్ష్యం వహిస్తుండటం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: