నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే పదవిలో నియమించేలా ఆదేశించాలన్న అభ్యర్థననూ తిరస్కరించింది. ప్రతివాదులకు నోటీసులిచ్చి.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

 

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో జస్టిస్ ఏఎస్‌ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించింది. 

 

తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గీ, రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపించారు. ఏపీ  ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌, ఎన్నికల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోందన్నారు. ఒక వైపు నిబంధనలన్నీ కొట్టి వేస్తూనే అవే నిబంధనల ప్రకారం రమేశ్‌ కుమార్‌ను ఎస్‌ఈసీ పదవిలో కూర్చోబెట్టాలని రెండు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వెల్లడించిందని వాదనలు వినిపించారు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించడం కోసమే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సి వచ్చిందని వివరించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు. 

 

ప్రభుత్వ వాదనపై స్పందించిన సీజేఐ బాబ్డే.. రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగవని వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్‌ వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని, ఇలాంటి వ్యవహారాలు మంచివి కావని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. ఈకేసులో ప్రతివాదులు చాలా మంది ఉన్నారని, వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. రెండు వారాల్లో ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 

 

హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రమేశ్‌ కుమార్‌ను కొనసాగించాలని రమేశ్‌కుమార్‌ తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే, వర్ల రామయ్య తరఫు న్యాయవాది ఏకే గంగూలి త్రిసభ్య ధర్మాసనాన్ని కోరగా.. అందుకు నిరాకరించింది. ఇప్పుడు  ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని, రెండు వారాల తర్వాత మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేస్తూ కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: