కరోనా ఇప్పుడు జర్నలిస్టులపై పగబట్టిందా అనిపిస్తోంది.. మొన్ననే టీవీ5 జర్నలిస్టు మనోజ్ మృత్యువాత పడ్డాడు. ఈ విషయం మర్చిపోక ముందే పలు మీడియా హౌజుల్లో జర్నలిస్టులు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. నెంబర్ వన్ చానల్ గా పేరున్న టీవీ9 ఆఫీసులోనూ కరోనా అడుగు పెట్టింది. గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్‌లో ఒకరికి కరోనా వచ్చినట్టు తెలుస్తోంది.

 

 

ఆ తర్వాత సాక్షి మీడియాలోనూ ఒకరికి కరోనా వచ్చినట్టు తేలింది. ఇంకా పలు చానళ్లకు చెందిన జర్నలిస్టులు, కెమేరా మెన్లు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. మరికొన్ని చానళ్ల టెక్నికల్ సిబ్బందికి కూడా కరోనా సోకినట్టు తేలింది. అయితే మొదట్లో జర్నలిస్టులకు వైద్యంపై సర్కారు అంతగా పట్టించుకోలేదని వార్తలు వచ్చినా.. ఆ తర్వాత బాగానే స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి ఈటల చొరవ తీసుకుని జర్నలిస్టులకు కరోనా పరీక్షలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

 

 

చివరకు గాంధీలో జర్నలిస్టుల కోసం ఓ ప్రత్యేకమైన వార్డు కూడా పెట్టారు. విషాదం ఏంటంటే ఆ వార్డుకు ఇటీవల కన్నుమూసిన మనోజ్ పేరు పెట్టారు గాంధీ సూపరిటెండెంట్. కరోనా పుణ్యమా అని అసలే అంతంత మాత్రంగా ఉండే జర్నలిస్టుల జీవితాలు మరింత దుర్భరం అయ్యాయి. చాలా చోట్ల జీతానికి గ్యారంటీ లేదు. కొన్ని చోట్ల ఇప్పటికే ఉద్యోగాలు గల్లంతయ్యాయి. మరికొన్నిచోట్ల మేం చెప్పేవరకూ రావద్దని చెప్పేశారు.

 

 

చివరకు ప్రముఖ దిన పత్రిక ఈనాడు సైతం లేఆఫ్ ప్రకటించింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు కరోనా కూడా జర్నలిస్టుల పాలిట శాపంగా మారింది. ప్రత్యేకించి ఈ కరోనా కాలంలో రిపోర్టర్ల జీవితం కత్తి మీద సాముగా మారింది. వృత్తిరీత్యా జనంలోకి వెళ్లని పరిస్థితి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి ఏదో ఒక చోట దాడి చేస్తూనే ఉంది. అందుకే పాత్రికేయులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. యాజమాన్యాలు కూడా తగిన చొరవ చూపి జర్నలిస్టులను ఆదుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: