ఏపీ సీఎం జగన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంలో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. సుప్రీం జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో రాజ్యాంగ పదవులతో ప్రభుత్వాలు ఆడుకోవద్దు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
ఆర్డినెన్స్ తీసుకురావడంలో ప్రభుత్వానికి మంచి ఉద్దేశాలు మరియు ఆలోచనలు ఉన్నాయి అని తాము సంతృప్తి చెందలేదని అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. సుప్రీంలో వ్యతిరేకతీర్పు రావడంతో రాష్ట ఎన్నికల కమిషనర్ పదవిలోకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందా...? చూడాల్సి ఉంది. కోర్టు ఆయనను ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశించింది. ప్రభుత్వం ఆయనను ఎప్పుడు పదవిలో నియమిస్తుందో స్పష్టత రావాల్సి ఉంది. 
 
సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి తీర్పు ప్రభుత్వానికి ఎదురుదెబ్బే కానీ ప్రతివాదులకు నోటిసులు ఇవ్వడం ఊరటనిచ్చే విషయం. కోర్టు ఆదేశాల ప్రకారం గతంలో నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చెల్లదని... కోర్టు తప్పుపట్టిన నిబంధనతో నియమించబడిన రమేష్ కుమార్ తిరిగి ఎలా కొనసాగింపబడతారని ప్రశ్నించగా న్యాయవాది‌ లేవనెత్తిన అంశాలపై రెండు వారాల్లోగా సమధానం చెప్పాలని మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో సహా ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 
 
కొందరు న్యాయవాదులు జగన్ సర్కార్ నిమ్మగడ్డను డైరెక్ట్ గా నియమించాలని చెబుతుంటే... మరికొందరు మాత్రం కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత మాత్రమే నియమించాలని చెబుతున్నారు. సీఎం ఏదైనా అంశంపై కోర్టుకు వెళ్లే ముందు న్యాయపరంగా సమస్యలు రాకుండా వెళ్లాలని... పభుత్వం తొందరపాటు చర్యల వల్లే ఎదురుదెబ్బలు తగులుతున్నాయని... రాబోయే కాలంలో సీఎం కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: