ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రభుత్వం తేల్చిచెప్పింది. తెలంగాణ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా.. తాము మాత్రం పరీక్షలు జరపాలనే నిర్ణయించినట్టు తెలిపింది. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూనే.. పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది ఏపీ సర్కారు. 

 

ఏపీలో పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జులై 10 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్టు తెలిపింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పింది. ఇప్పటికే పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచడంతో.. రూమ్ కు 12 మందే ఉండేలా ఏర్పాట్లు చేశామంది. విద్యార్థుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేశారన్న మంత్రి ఆదిమూలపు సురేష్.. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తామని చెప్పారు. విద్యార్థుల్లో కరోనా లక్షణాలుంటే.. ఐసోలేషన్ రూమ్ లో పరీక్షలు రాయడానికి కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

 

మార్చి నెలాఖరులో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో రోజురోజుకీ వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతుండటంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు, ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేయడంతో ఏపీలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీంతో టెన్త్ పరీక్షలపై ఏపీ సర్కారు స్పందించింది. 

 

పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం తేల్చిచెప్పినా.. గతంలో మాదిరిగా ఎవరైనా హైకోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటనే సందేహాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ప్రభుత్వం మొదట టెన్త్ పరీక్షలు నిర్వహించాలనే భావించింది. కానీ కరోనా ఉధృతి తరుణంలో.. జీహెచ్ఎంసీ మినహా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది. అయితే వేర్వేరు చోట్ల వేర్వేరు పద్ధతుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని యోచించిన తెలంగాణ ప్రభుత్వం.. టెన్త్ పరీక్షలు రద్దు చేసి.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఏపీ సర్కార్ మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: