లాక్ డౌన్ అనేక రంగాలను కుదేలు చేసింది. జీవితాలను తారుమారు చేసింది. ఉన్నపళంగా బికారులను చేస్తోంది. వ్యాపారాలు లేవు.. ఆదాయాలు లేవు.. ఉపాధి కరవు.. ఇలా మొత్తంగా సమాజమే సంక్షోభంలో పడింది. అయితే ఈ సంక్షోభం రైతుల జీవితాలను అతలాకుతలం చేసిందంటూ ఈనాడు దిన పత్రిక నిన్న తన పత్రికలో ప్రధానంగా ఓ వార్త ప్రచురించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ మరుణ మృదంగం పేరుతో కథనం ప్రముఖంగా ప్రచురించింది.

 

 

అయితే ఈ కథనంపై వైసీపీ ప్రభుత్వం ఘాటుగానే స్పందించింది. ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకు బలపడుతున్నాడన్న ద్వేషంతో తెలుగుదేశం పార్టీ, ఈనాడు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ఈనాడు ఇలా ప్రతి రోజు అబద్దాలు వండి వార్చడం ఫాషన్ అయిందని ఆయన విమర్శించారు. ఎవరి మెప్పు కోసం, ఎవరిని ఉత్సాహ పరచడానికి ఇలా రాస్తున్నారని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. ఈనాడు పత్రిక నిజాలు రాస్తే స్వాగతిస్తామని, కాని ఇలా ప్రజలను భయపెట్టడం కోసం రాస్తే మంచిది కాదని కన్నబాబు అన్నారు.

 

 

ఏపీలో రైతులను ఎవరూ పట్టించుకోవడం లేదని, చంద్రబాబు వంటి నేతను వదలుకోవడం వల్ల ఇలా జరుగుతోందన్న భావన కల్పించేందుకు ఈనాడు ప్రయత్నించిందని మంత్రి కన్నబాబు ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై తాము సమీక్ష చేశామని, కావాలని రైతులలో అభద్రత పెంచడం కోసం కట్టు కధలు వండి వార్చుతున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. రైతుల ఆత్మహత్యలపై అదికారుల నుంచి సమాచారం తీసుకున్నామని మంత్రి తెలిపారు.

 

 

లాక్ డౌన్ తర్వాత ఇరవై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఈనాడు రాసిందని.. కానీ.. అధికారులు సేకరించిన ప్రకారం జనవరి నుంచి మొత్తం చనిపోయినవారి సంఖ్యే 24 గా ఉందని మంత్రి అన్నారు. ఈ మరణాలకు అనేక కారణాలు ఉన్నాయని.. సహజ మరణాలను కూడా ఆత్మహత్యలుగా చిత్రీకరించారని మంత్రి వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: