నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో...బాబు చెప్పే నీతి వాక్యాల్లో నీతి కూడా అలాగే ఉండదు. అధికారంలో ఉన్నప్పుడూ ఇష్టారాజ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ చేసి...ప్రతిపక్షంలో కూర్చున్నాక నీతి సూత్రాలు చెబుతున్నారు. టీడీపీ ఓడిపోయాక చాలామంది నేతలు వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బాబుకు షాక్ ఇచ్చి...జగన్‌కు జై కొట్టారు. తాజాగా మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.

 

ఇక ఇలా వరుస పెట్టి నేతలు జారిపోవడంతో బాబు ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్ళిపోయి.. బెదిరింపులు, ప్రలోభాలతో వైసీపీ కొందరిని లోబరుచుకుంటుందని, ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లినా ఏమీ కాదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయితే ఇప్పుడు నీతులు చెబుతున్న బాబు...గత ఐదేళ్లు ఎంతమంది వైసీపీ నేతలనీ లాగేసుకున్నారో..ప్రజలకు బాగా తెలుసు. అనేక మంది నేతలని, 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీలోకి తీసుకున్నారు.

 

అయితే ఇలా ఆపరేషన్ ఆకర్ష్ చేసేప్పుడు బాబు పలువురు నేతలని ప్రలోభాలకు గురిచేశారు. భజన బృందం ద్వారా బెదిరింపులు కూడా చేశారు. ఇక దాంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పుకున్నారు. అమర్నాథ్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయకృష్ణ రంగారావులకు మంత్రి పదవి ఆఫర్ చేసి ప్రలోభ పెట్టారు. అయితే వారు వచ్చాక మంత్రి పదవులు ఇచ్చారు.

 

కాకపోతే జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్, చాంద్ బాషా ఇంకా కొందరికి మంత్రి పదవులు ఇస్తామని చెప్పి దారుణంగా మోసం చేశారు. అలాగే మరికొందరు కీలక పదవులు ఇస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇలా ఆపరేషన్ ఆకర్ష్ చేయడం వల్లే..జనం బాబుని చిత్తుగా ఓడించారు. అయితే బాబు మాదిరిగా జగన్ చేయడం లేదు. తమ పార్టీలోకి వచ్చేవారు పదవులు రాజీనామా చేసే రావాలనే కండిషన్ పెట్టారు. కానీ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీలో చేరకుండా పరోక్షంగా జగన్‌కు మద్ధతు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: