మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మొన్నటివరకు విధులు నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా ఉంది. ఆయనను అకస్మాత్తుగా తప్పించి కొత్త ఎన్నికల కమిషనర్ ను వైసీపీ ప్రభుత్వం నియమించింది .ఈ వ్యవహారంలో ఆయన హైకోర్టుకు వెళ్లడం, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టులోనూ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వం పైచేయి సాధించినట్లు గానే కనిపించారు. కానీ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన ఉద్దేశంలో చూస్తే ఇంకా తీర్పు రావాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం పూర్తిగా గవర్నర్ విచక్షణ ఆధారంగానే జరగాలని, రాష్ట్ర మంత్రిమండలికి గాని, ముఖ్యమంత్రి గానీ ఏ విధమైన సిఫార్సు చేసే అధికారం లేదని, ఈ కేసు వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 

 

IHG


ఈ మేరకు నూతన ఎన్నికల కమిషనర్ గా నియమితులైన కనగరాజు నియామకం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పేసింది. కాకపోతే రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సు మేరకు కనగరాజును గవర్నర్ గా నియమించినట్లు గానే,  గత టిడిపి ప్రభుత్వంలో అంటే 2015 డిసెంబర్ 12వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పంపించిన సిఫారసుల ఆధారంగానే అప్పటి గవర్నర్ నరసింహన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారు. కాబట్టి ఇప్పుడు హై కోర్ట్ చెప్పిన తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చెల్లదు అనేది ఏపీ ప్రభుత్వ వాదన. ఈ వ్యవహారంలో క్లారిటీ లేకపోవడంతోనే ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. 


ప్రస్తుతం ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం వాదనలు పూర్తిగా వింటాము అంటూ కోర్టు తెలిపింది. అలాగే ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాయర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఏపీ ప్రభుత్వం నమ్మకం పెట్టుకుంది. ఈ విషయంలో అనుకూలమైన తీర్పు వస్తే జగన్ కు కాస్త ఊరట లభించినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: