కరోనా ఎవరికి వస్తుంది..? ఎవరికి వచ్చినా తగ్గిపోతుంది..? ఎవరికి ప్రాణాంతంకంగా మారుతుంది.? ఈ అంశాలపై పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. అందులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అవేంటంటే.. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారి పట్ల కరోనా ప్రాణాంతకంగా మారుతోందట. అంటే ఇప్పటికే బీపీ, షుగర్‌, గుండె, కిడ్నీ, ఆస్తమా వంటి వ్యాధులు ఉన్నవారికి కరోనా వస్తే బతికి బట్ట కట్టే అవకాశాలు తక్కువట.

 

 

ఇప్పటి వరకూ మన దేశంలో జరిగిన కరోనా మరణాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను కరోనా నిర్దాక్షిణ్యంగా కబళిస్తోందట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకూ మరణించిన వారిలో 77 శాతానికి పైగా వీరే ఉన్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం వరకూ కొవిడ్‌ కారణంగా 78 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 77 శాతం మందికి ఇప్పటికే రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, గుండె, కిడ్నీ, ఇతర వ్యాధులు ఉన్నాయట.

 

 

అంతే కాదు.. మరణించిన 78 మందిలో సగం మంది వయస్సు 60 నుంచి 69 సంవత్సరాలట. అంటే ఈ కరోనా ఎక్కువగా మధ్య వయస్సు వారినే బలి తీసుకుంటోందన్నమాట. అందుకే ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 60 సంవత్సరాలు, ఆపై వయసు కలిగిన వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.

 

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కరోనా వైరస్‌ మరణాలు పెరుగుతున్నందున దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కూడా చెబుతోంది. 60 సంవత్సరాలు ఉండి రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులతో బాధపడే వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని చెబుతోంది. వింటున్నారా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: