దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య మూడు లక్షలకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో 9 వేల 996 పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. 357 మంది కరోనాతో మరణించారు. దేశంలో 24గంటల్లో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.

 

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షలకు సమీపిస్తోంది. గడచిన వారం రోజులుగా దేశంలో నిత్యం దాదాపు పదివేల కేసులతో పాటు 250కిపైగా మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 357మంది చనిపోయారు. దేశంలో కరోనా వైరస్‌ బయటపడిన అనంతరం 24గంటల్లో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 8వేల 102కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్‌.. కెనడాను దాటింది. ఇప్పటివరకు 12వ స్థానంలో ఉన్న భారత్‌ తాజా మరణాలతో ప్రపంచంలో 11వ స్థానానికి చేరింది.

 

గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 9,996 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 2లక్షల 86 వేల 579 మంది కరోనాబారిన పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైరస్‌ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు లక్ష 41వేల 29 మంది కోలుకోగా.. మరో లక్ష 37వేల 448 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అంటే.. యాక్టివ్ కేసులు కన్నా.. కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినవారే ఎక్కువగా ఉన్నారు. ఇదే కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఇక అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉంది. తాజా కేసులతో నాల్గవ స్థానంలో ఉన్న యూకేకి చేరువైంది.

 

ఇక కరోనా రికవరీ రేటు 52 శాతానికి పెరిగింది. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52 లక్షల13 వేల140 కరోనా టెస్టులు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో లక్షా 24 వేల శాంపిల్స్‌ను పరీక్షించారు. రాష్ట్రాల వారీగా కేసులు చూసుకుంటే... మహారాష్ట్ర 94 వేల 41 మందికి కరోనా సోకింది. అక్కడ 3 వేల 438 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 36 వేల 841 మంది బాధితులుంటే... 326 మరణాలు సంభవించాయి. దేశరాజధాని ఢిల్లీ.. కరోనా వ్యాప్తిలో మూడోస్థాయనంలో ఉంది. అక్కడ 32 వేల మందికి కరోనా సోకగా, 984 మంది మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: