ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ భేటీలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భోగాపురం, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కేబినెట్‌లో చర్చ జరిగింది. కేంద్రం రామాయపట్నం పోర్టుకు విభజన హామీల్లో భాగంగా నిధులు ఇవ్వాల్సి ఉందని కేంద్రం అభిప్రాయపడింది. 
 
ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మించాలని ఆగష్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ కేబినెట్ భేటీలో జగన్ సర్కార్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశంలో వైఎస్సార్ చేయూత పథకానికి ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50 వేల ఆర్థిక సాయం చేయనుంది. . ఆగష్టు 12న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. 
 
జగనన్న తోడు పథకం ద్వారా చిన్న వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం కింద సున్నా వడ్డీకే ప్రభుత్వం 10,000 రూపాయల రుణం అందించనుంది. ప్రాజెక్ట్ కోసం 200 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గండికోట, వెలిగొండ భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుమల ఆలయ తలపులు తెరిచేందుకు సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
గర్భిణీ, పిల్లలకు సంపూర్ణ పోషణ పథకం ద్వారా ప్రభుత్వం పోషకాహారం అందించనుంది. రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం పన్ను ఎగవేతను అరికట్టనుంది. మచిలీపట్నం, గుంటూరు, శ్రీకాకుళంలోని నర్సింగ్ కాలేజీల్లో 282 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం తీసుకుంది. గ్రేహౌండ్స్ శిక్షణ కోసం విశాఖ జిల్లాలో 385 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు... తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫైబర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ కోరాలని.... ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: